సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమంగా కేసులు, అరెస్టులకు సంబంధించి దాఖలు చేసిన పలు హెబియస్ కార్పస్ పిటిషన్లపై హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి వెల్లడించారు. సంబంధిత పోలీస్ స్టేషన్ల సీసీ ఫుటేజ్‌ను (ఈనెల 4నుంచి 8వ తేదీ వరకు) స్థానిక మెజిస్ట్రేట్‌కు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిందని ఆయన తెలిపారు. దీని వల్ల పోలీసుల తప్పులన్నీ బయటకు వస్తాయని చెప్పారు.
తమను ప్రశ్నించే గొంతు ఉండకూడదన్న లక్ష్యంతో, ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ, వైఎస్సార్‌సీపీ సోషల్‌మీడియా కార్యకర్తలపై అక్రమంగా కేసులు నమోదు చేయిస్తోందని పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు తెలిపారు. కూటమి ప్రభుత్వం గుడ్డిగా కేసులు నమోదు చేయిస్తోందన్న ఆయన.. ఉదాహరణగా ఒక కేస్‌ను ప్రస్తావించారు. తుళ్లూరు మండలం బోరుపాలెనికి చెందిన శ్రీనుపై కేసు పెట్టిన పోలీసులు విచారణకు పిలిచారని, కానీ అతను ఏడాదిన్నర క్రితమే చనిపోయారని చెప్పారు.
సోషల్ మీడియాలో వైఎస్సార్‌సీపీ అని కనిపిస్తే చాలు కేసులు పెడుతున్నారని, విచారణకు హాజరు కావాలంటూ గుడ్డిగా నోటీసులు ఇస్తున్నారని, అలా మరో 15 వేల మందిని బజారుకీడ్చి వారి కుటుంబాలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని మనోహర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులన్నింటికీ ఎప్పటికైనా డీజీపీనే బాధ్యత వహించాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
తమ హెబియస్ కార్పస్ పిటిషన్లపై తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసిందన్న వైఎస్సార్‌సీపీ లీగల్‌సెల్ అధ్యక్షుడు, ఆరోజు పోలీసులు చేసిన అన్ని తప్పులు బయటికి వస్తాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం డీజీపీపై ఒత్తిడి తీసుకొచ్చి ఇదంతా పోలీసుల ద్వారా చేస్తోంది కాబట్టి, అవసరమైతే డీజీపీని సుప్రీంకోర్టుకు లాగుతామని హెచ్చరించారు. పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు తాము పూర్తి అండగా ఉంటామని, కాపాడుకుంటామని మనోహర్‌రెడ్డి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment