సాక్షి, విజయవాడ: టీడీపీ తీరు ఆత్మస్తుతి పరనిందలాగా మారిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రభుత్వంపై పనిగట్టుకుని బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. ‘విధ్యంసం’ పుస్తకం పేరుతో ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని, చంద్రబాబు,పవన్ దిగజారిపోయి వ్యవహరిస్తున్నారంటూ దుయ్యబట్టారు.
‘‘చంద్రబాబు తన గురించి తాను రాసుకున్న ‘మనసులో మాట’ పుస్తకాన్ని బయటపెట్టాలి. చంద్రబాబు ఐదేళ్ల పాలనకు.. వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనకు బహిరంగ చర్చకు మేం సిద్ధం. ఎక్కడ చర్చకు రమ్మన్నా వచ్చేందుకు రెడీ. చంద్రబాబుకు ఇదే నా సవాల్. పథకాలిస్తుంటే ఏపీ శ్రీలంక అయిపోతుందన్నావ్. ఏ ముఖం పెట్టుకుని ఇప్పుడు ఆరు గ్యారంటీలిస్తానంటున్నావ్. ప్రజలు నిన్ను నమ్మం బాబు అంటున్నారు’’ మల్లాది విష్ణు పేర్కొన్నారు.
నీ గురించి గొప్పగా.. సీఎం జగన్‌పై తప్పుగా ప్రచారం చేయిస్తున్నావ్. బాబు జమానా అవినీతి ఖజానా అని పుస్తకం వేసింది సీపీఐ కాదా?. సీఎం జగన్‌పై బురద చల్లడానికే ‘విధ్వంసం’ పుస్తకాన్ని తెచ్చారు. సీఎం జగన్‌ని ఢీకొట్టే సత్తాలేక బాబు ఇతర పార్టీలను కలుపుకుంటున్నాడు. కుర్చీ కోసం పాకులాడటం తప్ప.. ప్రజలకు మేలు జరగాలనే ఆలోచన మీకులేదు. ఐదేళ్లలో విజయవాడ నగరానికి ఒక్క మంచి పనైనా చేశావా?. విజయవాడ అభివృద్ధి పై చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలి’’ అంటూ మల్లాది విష్ణు హితవు పలికారు.
‘‘పరిపాలనకు మీరు పనికిరారని, ప్రజలు 2019లో మిమ్మల్ని విధ్వంసం చేశారు. తప్పుడు సంకేతాలివ్వాలనే టీడీపీ నేతలు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. విధ్వంసం పుస్తకం వెనుక చంద్రబాబు, పవన్, సీపీఐ రామకృష్ణ ఉన్నారు. మూడు రాజధానులే మా పార్టీ విధానం. ఏపీలో పొత్తులు తేలాక ఎవరి పై ఎవరు రాళ్లు విసురుతారో.. ఎవరి కుర్చీ ఎవరు మడతపెడతారో తేలిపోతుంది. పొత్తులు ప్రకటించాక మంచి వినోదం మొదలవుతుంది. ఏపీని మోసం చేసిన పార్టీలే మళ్లీ కలిసి పోటీ చేయాలనుకుంటున్నాయి. చంద్రబాబు,పవన్ ది రెండు నాల్కల ధోరణి. వాలంటీర్లపై చంద్రబాబు, పవన్ ఏం మాట్లాడారో.. ఇప్పుడేం మాట్లాడుతున్నారో అంతా గమనిస్తున్నారు’’ అని మల్లాది విష్ణు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment