మాట్లాడుతున్న మేరుగ నాగార్జున, హెనీ క్రిస్టినా
సాక్షి, గుంటూరు: అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో దేశచరిత్రలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా అనేక పథకాలతో.. సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేని చంద్రబాబు.. ప్రభుత్వంపై నిత్యం బురదజల్లుతున్నారని వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. గుంటూరులో గురువారం జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినాతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
మృదు స్వభావి అయిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ సలహాదారుగా ప్రతిపక్ష నేతను, నాయకులను వ్యక్తిగతంగా ఏ ఒక్క మాట అనని రామకృష్ణారెడ్డి గురించి ఇష్టారాజ్యంగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని హె చ్చరించారు. చంద్రబాబు సంస్కారం తెలియని అజ్ఞాని అంటూ దుయ్యబట్టారు.
పేదలకు మేలు చేసే ఓటీఎస్‌పై తప్పుడు ఆరోపణలు చేయడం చంద్రబాబు రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. మూడుసార్లు సీఎంగా.. 14 ఏళ్ల పాటు పరిపాలన చేసిన చంద్రబాబు పేరు చెబితే ప్రజలకు గుర్తుకొచ్చే ఒక్క సంక్షేమ పథకమైనా ఉందా.. అని ప్రశ్నించారు. పెయిడ్ ఆర్టిస్టులకు డబ్బులు ఇచ్చి నిత్యం ప్రభుత్వంపై బురద జల్లిస్తున్నారని, వారి ఆటలు ఇక సాగనిచ్చేదిలేదన్నారు.
తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాటిస్తున్న సమన్యాయం, సహనం కారణంగానే టీడీపీ నేతలు ఎంతలా అవాకులు, చవాకులు పేలినా భరిస్తున్నామని, ఇలానే రెచ్చగొడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. గుంటూరు జెడ్పీ చైర్‌పర్సన్ క్రిస్టినా మాట్లాడుతూ పాత్రికేయ విలువలు కలిగిన సజ్జల రామకృష్ణారెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment