సాక్షి,అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘సిద్ధం’ పేరుతో నిర్వహిస్తున్న ఎన్నికల శంఖారావ సభలు తెలుగుదేశం పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. ఈ సభలు జరుగుతున్న తీరు, వాటికి వస్తున్న జనాన్ని చూసి వారు గెలుపుపై ఆశలు వదిలేసుకుంటున్నారు. జగన్ జన బలం సుప్రసిద్ధమేనని, అయితే గత వారం భీమిలిలో జరిగిన సభతోపాటు శనివారం దెందులూరులో నిర్వహించిన సభ అంతకుమించి సూపర్ సక్సెస్ అయ్యాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
దీంతో టీడీపీ పూర్తిగా అంతర్మథనంలో పడిపోయింది. ఇప్పటివరకు రకరకాల ప్రచారాలతో తమ పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందంటూ ఊదరగొడుతున్న టీడీపీ అధిష్టానమూ ఈ పరిణామాలతో ఉలిక్కిపడుతోంది. అదేపనిగా వైఎస్సార్‌కు, జగన్‌కు వ్యతిరేకంగా దుష్ప్రచారాలు చేసినా, ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి మరీ వ్యతిరేక ప్రచారాన్ని చేయించినా అవేమీ పనిచేయడం లేదని, జనంలో జగన్‌కు ఉన్న ఆదరణను తగ్గించలేకపోయాయని తేలడంతో టీడీపీ డీలాపడిపోయింది. తమ పార్టీ నిర్వహించే సభలకు జనం రాకుండా, వైఎస్ జగన్ సభలకు జనం పోటెత్తుండడం తమ నైతిక ఓటమికి సంకేతమని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.
‘రా కదలి రా’ అట్టర్ ఫ్లాప్‌తో ఆవేదన
చంద్రబాబు గత నెలలో నిర్వహించిన ‘రా కదలిరా’ సభలు అట్టర్‌ప్లాప్ కావడాన్ని గుర్తుచేసుకుని టీడీపీ నేతలు కుమిలిపోతున్నారు. ఈ సభలను 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో నిర్వహించాలని, ఒక్కో సభకు కనీసం లక్ష మందిని, కుదరకపోతే 50 వేల మందినైనా సమీకరించాలని ప్రణాళిక రూపొందించారు. కానీ అతికష్టం మీద 16 సభలు నిర్వహించగలిగారు. ఏ ఒక్క సభకూ 20 వేల మందిని మించి తీసుకురాలేకపోయామని ఆ పార్టీ సీనియర్లే ఆవేదన చెందుతున్నారు. సభలకు జనం రాకపోతుండడంతో చంద్రబాబు మధ్యలోనే వాటికి విరామం ఇచ్చారు. ఏం చేయాలోనని మంతనాలు జరిపారు. తాము సభలు నిర్వహించలేమని, జనాన్ని సమీకరించలేమని చాలాచోట్ల నేతలు చేతులు ఎత్తేసినట్టు సమాచారం. దీంతో అర్థాంతరంగా సభలు ఆపితే సమాధానం చెప్పుకోలేమని, ఎలాగొలా ముగించడానికి అధిష్టానం అష్టకష్టాలు పడుతోంది.
బాబును జనం నమ్మడం లేదు
మోసాలు, నయవంచనతో చంద్రబాబు ప్రజల నమ్మకం కోల్పోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఆ పార్టీ నాయకులే అసహనం వ్యక్తం చేస్తున్నారు. అబద్ధాలు, కట్టుకథలతో జనాన్ని మళ్లీ మోసం చేయాలని శత విధాలుగా యత్నిస్తున్నా.. జనం నుంచి స్పందన లేదని, బాబు ప్రసంగం కూడా పస లేకుండా ఉంటుందని, వైఎస్ జగన్‌పై విషం కక్కడాన్ని ప్రజలు జీరి్ణంచుకోలేకపోతున్నారని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు.
జగన్‌ను తిట్టడం తప్ప అధికారంలో ఉన్నప్పుడు తాను ఏం చేశానో చెప్పే పరిస్థితి చంద్రబాబుకు లేదని అభిప్రాయపడుతున్నారు. కొత్తగా ఏం చేస్తారో కూడా బాబు స్పష్టంగా చెప్పలేకపోతున్నారని, ఉన్న పథకాలనే పేర్లు మార్చి తానూ ఇస్తానని చెప్పడాన్ని ప్రజలు విశ్వసించడం లేదని పేర్కొంటున్నారు. ఫలితంగా వచ్చే ఎన్నికల్లోనూ తమకు ఓటమి తప్పదని తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు విశ్లేషించుకుంటున్నారు.
ఇదీ చదవండి: అక్షౌహిణులు సిద్ధం!
Comments
Please login to add a commentAdd a comment