
సాక్షి, గుంటూరు: గుడ్లవల్లేరు ఘటనపై ప్రభుత్వ ఘోర వైఫల్యం కనిపించిందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మండిపడ్డారు. వాష్ రూముల్లో కెమెరాలు పెట్టినట్టు విద్యార్థినులు గుర్తించి ఫిర్యాదు చేసినా కాలేజీ యాజమాన్యం ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు.
‘‘పోలీసులు వెంటనే స్పందించలేదు. లక్షలాది రూపాయలు ఫీజులు తీసుకుని విద్యార్థినుల మానంతో ఆటలాడుకుంటారా?. అనేక ఐఐటీల్లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెయ్యి మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయితే నో పోలీస్. గుడ్లవల్లేరులో రాత్రి నుంచి విద్యార్థినులు ఆందోళన చేస్తుంటే నో పోలీస్. గుడ్లవల్లేరు వెళ్లటానికి హోంమంత్రికి తీరిక లేదా?. సకల శాఖా మంత్రి లోకేష్ ఏం చేస్తున్నారు?’’ అంటూ శివశంకర్ ప్రశ్నించారు.
‘‘విద్యార్థులను వేధించిన విజయ్ అనే యువకుడు జనసేన పార్టీ. అతని సోషల్ మీడియా పోస్టులు అన్నీ అవే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యావ్యవస్థ నాశనం అయింది. విద్యార్థుల మాన, ప్రాణాలను కాపాడాలి. పోలీసు విచారణ జరిపిస్తామని ప్రభుత్వం ప్రకటన చేసింది. తర్వాత రెండు నిమిషాలకే కెమెరాలు లేవని పోలీసులు ఎలా ప్రకటించారు?. రెండు నిమిషాల్లోనే విచారణ పూర్తి చేశారా?. విద్యార్థినుల ఆందోళన కనపడటం లేదా?. వెంటనే కాలేజీని మూసేసి పూర్తి స్థాయి విచారణ జరపాలి’’ అని శివశంకర్ డిమాండ్ చేశారు.

Comments
Please login to add a commentAdd a comment