
సాక్షి, విశాఖపట్నం: సీఎం చంద్రబాబు అభిమాన సంఘం అధ్యక్షురాలిగా కాంగ్రెస్ చీఫ్ షర్మిల వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. పచ్చ కళ్లద్దాలు తీసి షర్మిల వాస్తవాలు మాట్లాడాలి అంటూ హితవు పలికారు. ఆరోగ్యశ్రీపై నిజాలు తెలుసుకొని మాట్లాడాలని చురకలంటించారు.
కాగా, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి గురువారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై షర్మిల పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు అభిమాన సంఘం అధ్యక్షురాలిగా షర్మిల వ్యవహరిస్తున్నారు. ఏపీలో ఆరోగ్య శ్రీపై చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టును షర్మిల చదువుతున్నారు. వైఎస్ జగన్ 32వేల కోట్లు వైద్య రంగానికి ఖర్చు చేశారు. ఆరోగ్య శ్రీ పరిధిని 25 లక్షలకు పెంచారు. చంద్రబాబు ఆరోగ్యశ్రీకి ఖర్చు చేసింది ఎంత?. వైఎస్ జగన్ సుమారు 15వేల కోట్లు ఖర్చు చేశారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం షర్మిలకు కనిపించడం లేదా?. చంద్రబాబు పాలనలో ఆరోగ్య శ్రీలో 1000 వ్యాధులకు మాత్రమే వైద్యం చేసేవారు. వైఎస్ జగన్ పాలనలో మూడు వేలకుపైగా వ్యాధులకు వైద్యం అందించారు. ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను తీసుకువచ్చిన ఘనత వైఎస్ జగన్‌దే. పచ్చ కళ్లద్దాలు తీసి షర్మిల వాస్తవాలు మాట్లాడాలి. చంద్రబాబు సీఎంగా దిగిపోయే సమయానికి ఆరోగ్య శ్రీలో ఉన్న 700 కోట్ల బకాయిలను వైఎస్ జగన్ చెల్లించారు’ అని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment