
సాక్షి, పల్నాడు జిల్లా: బొల్లాపల్లి మండలం వెంకుపాలెంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఒంటేరు నాగరాజును కిడ్నాప్ చేశారు. ఆటోలో కూరగాయలు అమ్ముకుంటున్న నాగరాజును బొలెరో వాహనంతో అడ్డుకుని.. బలవంతంగా తీసుకెళ్లిన ప్రత్యర్థులు.. నాగరాజు కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దుర్గి మండలం జంగమహేశ్వరపాడు వదిలేసి వెల్లటూరులో నాగరాజు కుటుంబం ఉంటుంది.
కాగా, టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అడ్డూ అదుపు లేకుండా దాడులు కొనసాగుతున్నాయి. టీడీపీ రౌడీమూకలు దండెత్తుతుండటంతో సామాన్యులు ప్రాణభయంతో కన్నతల్లి వంటి సొంత ఊరును వదిలి వలసవెళ్లిపోతున్నారు. పొరుగు రాష్ట్రంతోపాటు అటవీ ప్రాంతాల్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఒక్క పల్నాడు జిల్లాలోనే 1,500 కుటుంబాలు తెలంగాణకు వెళ్లి తలదాచుకోవడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం.
చిత్తూరు జిల్లాలో దాదాపు 500 కుటుంబాలు, అనంతపురం జిల్లాలో 350 కుటుంబాలు, శ్రీసత్యసాయి జిల్లాల్లో 100, అన్నమయ్య జిల్లాలో 120 కుటుంబాలు, కర్నూలు జిల్లాలో 135 కుటుంబాలు తమ గ్రామాలను వదిలి వలసవెళ్లాయి. వలస వెళ్లిన కుటుంబాల పంటలను, ఆస్తులను సైతం టీడీపీ మూకలు ధ్వంసం చేస్తూ పైశాచికంగా ప్రవర్తిస్తున్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు దాదాపు 2,700 కుటుంబాలు ప్రాణభయంతో వలస వెళ్లాయి.

Comments
Please login to add a commentAdd a comment