బూట్లు చూపిస్తున్న షర్మిల
సాక్షి, హైదరాబాద్/చెన్నారావుపేట/నెక్కొండ: ‘పాదయాత్ర ఒక యజ్ఞం.. అది అందరికీ సాధ్యం కాదు’అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. గురువారం ఆమె లోటస్‌పాండ్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం వరంగల్ జిల్లాలో ఎక్కడైతే తన ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆపిందో అక్కడి నుంచే మళ్లీ మొదలుపెడుతున్నట్లు తెలిపారు.
పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తున్నందున గవర్నర్‌ను కలవడం కుదరలేదన్నారు. తాను ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించనని, ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే ప్రశ్నిస్తానన్నారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్ ఘోరంగా మోసం చేశారన్నారు. కేసీఆర్ కారణంగా దాదాపు 16 లక్షల మంది రైతులు డిఫాల్టర్లుగా నిలబడ్డారన్నా రు. దమ్ముంటే, తన పాలనపై నమ్మకం ఉంటే కేసీఆర్.. ఒక్క రోజు ఈ బూట్లు వేసుకొని పాదయాత్రకు రావాలని ఆమె సవాల్ విసిరారు.
తనతో పాదయాత్రకు వచ్చి ప్రజలకు సమస్యలు ఏమీ లేవని రుజువు చేయాలన్నారు. సమస్యలు లేవని చూపిస్తే తాను ముక్కు నేలకు రాసి, రాజకీయాలు మానేసి.. ఇంటికి వెళ్లిపోతానన్నారు. సమస్యలు ఉన్నాయని తేలితే కేసీఆర్ తన పదవికి రాజీనామా చేసి ఒక దళితుడిని ముఖ్య మంత్రిని చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తమతో పాదయాత్రకు రావడానికి బూట్లు కూడా పంపిస్తున్నామన్నారు. ‘పిట్టల దొరలాగా టోపీ పెట్టుకొని ప్రైవేట్ విమానాల్లో తిరగడం కాదు. ఓట్లేసి గెలిపించిన ప్రజల గురించి ఆలోచించాలి’అని షర్మిల హితవు పలికారు.
కేసీఆర్ పాలనకు అంతం పలకాలి
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయని కేసీఆర్ పాలనను అంతం చేయాలని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం శంకరంతండాలో రెండు నెలల క్రితం ఆగిన చోట నుంచే గురువారం సాయంత్రం 4.30 గంటలకు ఆమె ప్రజాప్రస్థానం పాదయాత్రను తిరిగి ప్రారంభించారు.
సూరిపెల్లి క్రాస్ రోడ్డు నుంచి నెక్కొండకు పాదయాత్ర చేరింది. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ 2 నెలల క్రితం పాదయాత్ర చేస్తుంటే శాంతిభద్రతల సమస్య అంటూ తనను అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారన్నారు. కేసీఆర్ రూ.4 లక్షల కోట్ల అప్పును ఎవరి కోసం తీసుకుని ఖర్చు చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment