డిండిచింత పల్లిలో మాట్లాడుతున్న షర్మిల
వంగూరు: దివంగత మహానేత వై.ఎస్. రాజశేఖరరెడ్డికి పాలమూరు జిల్లా అంటే అమితప్రేమ అని, ఈ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు చేపట్టిన ఘనత ఆయనకే దక్కిందని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఆమె చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా డిండిచింతపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా లోని కల్వకుర్తి, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులు వైఎస్సార్ హయాంలోనే పూర్తయ్యాయని, అయితే కల్వకుర్తి ప్రాజెక్టులో మిగిలిన పదిశాతం పనులు పూర్తిచేయడంలో సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. ఎనిమిదేళ్లలో కేసీఆర్ రాష్ట్రానికి చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. డిండిచింతపల్లి ప్రజలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు దుందుభి వాగుపై వైఎస్సార్ వంతెన నిర్మిస్తే, కేసీఆర్ ఆ వంతెనపై బస్సులు కూడా నడిపే పరిస్థితిలో లేరన్నారు. ఉద్యమకారుడని తెలంగాణ ప్రజలు అధికారం అప్పగిస్తే పాలనను గాలికి వదిలి ఫాంహౌస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు.
రూ.4 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రాజెక్టుల పేరుతో దోపిడీ చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక ఉన్నత చదవులు చదివిన విద్యార్థులు సైతం కూలీ పనులకు వెళున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రజలు మళ్లీ వైఎస్సార్ పాలన రావా లని కోరుకుంటున్నారని, అది కేవలం వైఎస్సార్‌టీపీతోనే సాధ్యమని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment