సాక్షి, విజయవాడ: రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని క్లీన్ స్వీప్ చేశామని.. వచ్చే ఎన్నికల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయన బుధవారం ఉదయం అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువపత్రం అందుకున్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం సంతోషంగా ఉందన్నారు. టీడీపీని పెద్దల సభలో ఖాళీ చేశామని, మొత్తం స్థానాలు వైఎస్సార్ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసిందని తెలిపారు. ఒక్కొక్క సభలో టీడీపీని ఖాళీ చేస్తున్నామని.. త్వరలో లోక్‌సభ, శాసనసభలో కూడా క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పారు.రాజ్యసభ ఎన్నికల్లో సంఖ్యా బలం లేకపోయినా ప్రతిపక్ష టీడీపీ పోటీ చేయాలని భావించిందని కానీ తమ ఎమ్మెల్యేలు అందరూ సీఎం జగన్ పట్ల విశ్వాసంతో ఉండటంతో తాము ఏకగ్రీవంగా గెలవగలిగామని పేర్కొన్నారు.
టీడీపీ, కాంగ్రెస్ ప్రలోభాలతో తమ పార్టీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు మళ్ళీ తిరిగివస్తున్నారని, ప్రజా బలం ముందు ప్రలోభాలు పని చేయవని తెలిపారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలలో ఉన్న వారికి రాజకీయ మనుగడ ఉండదని విమర్శించారు. సీఎం జగన్‌తో ఉంటేనే ఎవరికైనా రాజకీయంగా మంచి జరుగుతుందన్నారు. వైఎస్ జగన్‌తోనే జనం ఉన్నారన్నారు.
కాగా, రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి వైవీ సుబ్బారెడ్డి, మేడా మల్లిఖార్జునరెడ్డి, గొల్ల బాబూరావు ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ మూడు స్థానాలకు దక్కించుకోవడంతో రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ బలం 11కు చేరుకుంది.
చదవండి: విశాఖ బయల్దేరిన సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment