గిద్దలూరు రూరల్: ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల పశ్చిమ ప్రాంత పర్యటనలో మొదటి రోజు బుధవారం గిద్దలూరులో ఏర్పాటు చేసిన సభ అట్టర్ ఫ్లాప్ అయింది. సభా ప్రాంగణం జనం లేక వెలవెలబోయింది. వాహనాలు పెట్టి, మద్యం, డబ్బు ఆశచూపి తరలించిన అరకొర జనం కూడా చంద్రబాబు ఊకదంపుడు ప్రసంగం వినలేక మధ్యలోనే వెళ్లిపోయారు. చంద్రబాబు ప్రసంగం ఆరంభంలోనే అబద్ధాలతో మొదలుపెట్టారు. గిద్దలూరుకు తాను ఎన్నోసార్లు వచ్చానని చెప్పడంతో ప్రజలు విస్తుపోయారు.
ముందుగా ఆదిమూర్తిపల్లె నుంచి గిద్దలూరు గాందీబొమ్మ సెంటర్, రాచర్లగేటు సెంటర్ల మీదుగా ఒంగోలు హైవే రోడ్డులో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చంద్రబాబు చేరుకున్నారు. రాచర్ల గేటు సెంటర్‌లో చంద్రబాబుకు గజమాల వేసేందుకు ఏర్పాటు చేయడంతో ఆ సెంటర్‌లో రైల్వే గేటు వేయడం వల్ల జనాలు ఎక్కువగా నిలిచి ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. సభా ప్రాంగణం ఆవరణలో విచ్చలవిడిగా మద్యం పోస్తూ మద్యం ప్రియులు అక్కడే ఉండేలా చేశారు. తక్కువ జనం వచ్చినా కూడా ఎక్కువ జనం కనపడేలా సభా ప్రాంగణ స్థలం చిన్నది ఎంచుకుని సభను అక్కడే ఏర్పాటు చేశారు. కొందరు టీడీపీ కార్యకర్తలు మద్యం తాగుతూ విచ్చలవిడిగా ప్రవర్తించారు. ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్‌కు దారి ఇవ్వకుండా మద్యం మత్తులోని కొందరు యువకులు ఇష్టానుసారంగా ప్రవర్తించారు.
పోలీసులు వారిని వారించి పక్కకు పంపించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా బైక్‌ల పై ప్రమాదకరంగా తిరుగుతుండటంతో పోలీసులు వారిని అదుపుచేయగా వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఓటు హక్కు లేని చిన్నారుల చేతికి టీడీపీ జెండాలను ఇచ్చి మరీ వాహనాల పైకి ఎక్కించి ప్రచారం చేయించారు. సభలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ముత్తుముల అశోక్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే సాయికల్పన దూరం
గిద్దలూరులో చంద్రబాబు పర్యటన సందర్భంగా టీడీపీలో వర్గ పోరు బట్టబయలైంది. మాజీ ఎమ్మెల్యే పిడతల సాయికల్పనారెడ్డి తనకు తగిన మర్యాద ఇవ్వకపోగా చంద్రబాబు వస్తున్న విషయం ఒక్క రోజు ముందుగా సమాచారం అందిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసి బాబు పర్యటనకు దూరంగా ఉండిపోయారు. ‘‘ఇదేం ఖర్మ నాకు ఎవరినో ఎమ్మెల్యేను చేయడానికి నేను తిరగాలా’’ అంటూ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
పార్టీలో నన్ను కరివేపాకులా వాడుకుని వదిలేస్తారా అంటు మండిపడుతున్నారు. దీంతో ఆమె వర్గీయులు సైతం చంద్రబాబు సభకు దూరంగానే ఉండిపోయారు. మరో వైపు నియోజకవర్గంలో అత్యధిక ఓటు శాతం కలిగిన యాదవ సామాజిక వర్గానికి చెందిన పెట్టెల నారాయణయాదవ్ తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలంటూ నియోజకవర్గంలో తిరుగుతూ ఇన్‌చార్జ్ అశోక్‌రెడ్డికి దూరంగా ఉంటున్నారు. అందులో భాగంగానే తాను తన వర్గీయులతో ఆదిమూర్తిపల్లె సమీపంలోనే చంద్రబాబును కలిశాడు. బీసీలకు న్యాయం చేయాలంటూ కోరినట్లు సమాచారం.\
Comments
Please login to add a commentAdd a comment