
అద్దె చెల్లించలేదని సచివాలయానికి తాళం
● సిబ్బంది హామీతో తెరుచుకున్న వైనం
మార్కాపురం: మండలంలోని పెద్ద నాగులవరం గ్రామ సచివాలయానికి అద్దె చెల్లించలేదని యజమాని బ్రహ్మయ్య సోమవారం తాళం వేశాడు. దీంతో సిబ్బంది కొంత సేపు బయటే వేచి ఉన్నారు. త్వరలోనే అద్దె చెల్లిస్తామని నచ్చజెప్పడంతో ఆయన తాళం తీశారు. ఐదు నెలలుగా సుమారు 13 వేల రూపాయల అద్దె చెల్లించకపోవడంతో బ్రహ్మయ్య తన ఇంట్లో ఉన్న సచివాలయానికి తాళం వేశారు. పంచాయతీ సెక్రటరీ ఎ.శ్రీనివాసులు అద్దె చెల్లిస్తానని హామీ ఇవ్వడంతో తాళాలు తీసి ఉద్యోగులను అనుమతించారు.
రెండు పొగాకు
బ్యారన్లు దగ్ధం
పొన్నలూరు: మండలంలోని వెంకుపాలెం గ్రామంలో మాదాల ప్రసాద్, బత్తిన కొండయ్య, పర్వతనేని రవికుమార్, పర్వతనేని వెంకట్రావుకు చెందిన రెండు పొగాకు బ్యారన్లు సోమవారం ప్రమాదవశాత్తు దగ్ధమయ్యాయి. పొగాకు క్యూరింగ్ చేస్తుండగా అల్లిక కర్ర జారి మొద్దుగొట్టంపై పడటంతో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చారు. బ్యారన్ లోపలి భాగం పూర్తిగా కాలిపోవడంతో రూ.8 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు బాధిత రైతులు వాపోయారు.
నేటి నుంచి జ్ఞానజ్యోతి శిక్షణ
ఒంగోలు సిటీ: జిల్లా వ్యాప్తంగా 38 మండలాల్లో 76 కేంద్రాల్లో ఈ నెల 18వ తేదీ నుంచి 120 రోజుల పాటు జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమాన్ని అంగన్‌వాడీ టీచర్లకు నిర్వహించనున్నట్లు డీఈఓ అత్తోట కిరణ్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాల విద్యాశాఖ, సమగ్రశిక్ష, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ సమన్వయంతో ఆరు రోజుల పాటు రెండు విడతలుగా శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. డీఆర్పీల ఆధ్వర్యంలో శిక్షణ జరుగుతుందని, సంబంధిత పాఠశాలల హెచ్‌ఎంలు కోర్సు డైరెక్టర్లుగా వ్యవహరిస్తారని తెలిపారు. శిక్షణను షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
వెలిగొండకు రూ.2 వేల కోట్లు ఇవ్వాలి
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య
కనిగిరి రూరల్(హనుమంతునిపాడు): పశ్చిమ ప్రాంత ప్రజల వర ప్రదాయిని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు తక్షణమే రూ.2 వేల కోట్లు నిధులు విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. సోమవారం కనిగిరి ఆర్డీఓ కార్యాలయం ముందు సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సయ్యద్ యాసీన్ అధ్యక్షతన నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోకి పీసీపల్లి మండలాన్ని చేర్చాలని, కనిగిరి ప్రాంతంలోని రిజర్వాయర్లను అనుసంధానించాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు ఆర్‌ఆర్ ప్యాకేజ్ అందించాలన్నారు. త్వరలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించి కరువు ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం ఆర్డీఓ కేశవర్థనరెడ్డికి వినతి ప్రతం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ, ప్రజా సంఘాల నాయకులు జీపీ రామారావు, గుజ్జుల బాలిరెడ్డి, ఖాశిం పీరా, పందిటి మోహన్, మౌలాలి, పూర్ణచంద్రరావు, పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అద్దె చెల్లించలేదని సచివాలయానికి తాళం

అద్దె చెల్లించలేదని సచివాలయానికి తాళం
Comments
Please login to add a commentAdd a comment