
బెంగళూరులో కేసు నమోదైందంటూ మోసం
కూలీల కోసం ఏర్పాటుచేసిన ఆర్టీసీ బస్సు
● ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఎస్పీ దామోదర్‌కు ఫిర్యాదు
ఒంగోలు టౌన్: మీ మీద బెంగళూరులో కేసు నమోదైందని, అరెస్టు చేయకుండా బెయిల్ ఇవ్వాలంటే డబ్బు చెల్లించాలంటూ సీబీఐ పోలీసు అధికారులుగా నటిస్తూ వీడియో కాల్ చేశారని కనిగిరికి చెందిన ఒక బాధితుడు ఎస్పీ ఏఆర్ దామోదర్‌కు ఫిర్యాదు చేశారు. తమ వద్ద నుంచి భారీగా డబ్బులు కూడా వసూలు చేశారని తెలిపారు. వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు తమను భయభ్రాంతులకు గురిచేశారని, తమ అకౌంటు నుంచి ఆర్టీజీఎస్, ఫోన్ పే ద్వారా డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారని చెప్పారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీని కలిసి బాధితుడు గోడు వెళ్లబోసుకున్నాడు. సైబర్ నేరగాళ్లను కఠినంగా శిక్షించి తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. అదేవిధంగా రైల్వేలో ఉద్యోగం పేరుతో నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్ ఇచ్చి ఒంగోలుకు చెందిన వ్యక్తి తమ వద్ద నుంచి డబ్బు వసూలు చేశాడని పల్నాడు జిల్లాకు చెందిన మరో బాధితుడు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. తీరా చూస్తే.. నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్ ఇచ్చినట్లు తెలుసుకుని నిలదీయగా జవాబు ఇవ్వడంలేదన్నారు. తమ వద్ద నుంచి వసూలు చేసిన డబ్బు తిరిగివ్వమని అడుగుతుంటే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నాడని తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి 81 మంది బాధితులు ఎస్పీని కలిసి వివిధ సమస్యలపై ఫిర్యాదు చేశారు.
డిజిటల్ అరెస్టుల పేరుతో ఫోన్ వస్తే
పోలీసులకు తెలియజేయాలి...
సైబర్ నేరగాళ్లు వివిధ రకాలుగా మోసాలకు పాల్పడుతున్నారని ఎస్పీ దామోదర్ అన్నారు. మీ మీద కేసు నమోదైందని, డిజిటల్ అరెస్టు చేయకుండా ఉండాలంటే డబ్బు చెల్లించమని ఎవరికై నా ఫోన్లు వస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. డిజిటల్ అరెస్టుల గురించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి భయాందోళనకు గురవకుండా జాగ్రత్త పడాలని చెప్పారు. సీబీఐ, ఈడీ, కస్టమ్, ఏసీబీ అధికారుల మాదిరిగా నటిస్తూ వీడియో కాల్ చేయడంతో పాటు ముందుగా సేకరించిన వివరాలతో భయాందోళనకు గురిచేస్తున్నారని వివరించారు. అచ్చం పోలీసుల మాదిరిగా లోగోలు కనిపించేలా నటిస్తూ ప్రశ్నలు సంధిస్తారని, లక్షలు కాజేస్తున్నారని తెలిపారు. ఎన్ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు ఎప్పుడూ లోకల్ పోలీసులను సంప్రదించకుండా ఎవరినీ అరెస్టులు చేయవని, కొత్త వ్యక్తుల నుంచి అనుమానాస్పద ఫోన్లను లిఫ్టు చేయకపోవడమే మంచిదని సూచించారు. ఏదైనా అనుమానం వస్తే వెంటనే 1930 ఫోన్ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని చెప్పారు. కార్యక్రమంలో రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు, సింగరాయకొండ సీఐ హజరత్తయ్య, ట్రాఫిక్ సీఐ పాండురంగారావు, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సై షేక్ రజియా సుల్తానా, ప్రభాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment