
అంగన్‌వాడీ సమస్యలు పరిష్కరించాలి
ఒంగోలు సిటీ: అంగన్‌వాడీ వర్కర్లకు గతంలో సమ్మె కాలంలో ఇచ్చిన మినిట్స్ కాపీలకు జీవోలివ్వాలని యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు పి.కల్పన డిమాండ్ చేశారు. సోమవారం ఒంగోలు ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్‌వాడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ ఉపాధ్యక్షురాలు మాట్లాడుతూ.. సమస్యలు పరిష్కరించాలని గతంలో 42 రోజులపాటు సమ్మె సందర్భంగా ఇచ్చిన మినిట్స్ కాపీలను జీవో రూపంలో ఇవ్వాలన్నారు. ఒంగోలు నగర కార్యదర్శి టి.మహేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ వర్కర్స్ అతి తక్కువ వేతనాలతో జీవనం సాగిస్తున్నారన్నారు. 2019లో అంగన్‌వాడీ వర్కర్లకు ఆనాటి ధరలకు అనుగుణంగా వేతనం పెంచారన్నారు. నిత్యవసర ధరలు రోజురోజుకూ పెరుగుతున్నా కార్మికులకు వేతనాలు పెంచడంలో ప్రభుత్వాలు మీనవేషాలు లెక్కిస్తున్నాయని విమర్శించారు. అంగన్‌వాడీలకు కనీసం వేతనం రూ.26 వేలు ఇవ్వాలని గ్రాడ్యూటీ అమలు చేయాలన్నారు. మినీ సెంటర్లను మెయిన్‌గా మార్పు చేయడంతోపాటు పెండింగ్‌లో ఉన్న డీఏ బిల్లులు వెంటనే ఇవ్వాలన్నారు. అన్ని యాప్‌లు రద్దు చేసి ఒకే యాప్‌గా మార్పు చేయాలని, కేంద్రాలకు ఉచితంగా గ్యాస్ సరఫరా చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించకుంటే కార్మిక సంఘాలతో కలిసి పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు స్వామిరెడ్డి, యూనియన్ ఒంగోలు నగర ప్రాజెక్టు అధ్యక్ష, కార్యదర్శులు పద్మ, కె.ఎమియా, నాయకులు కే.వి.సుబ్బమ్మ, నిర్మల, పద్మ, శేషమ్మ, సంద్య, జ్యోతి, రాజేశ్వరి, శోభ, శ్రీదేవి, గౌసియా, కవిత తదితరులు పాల్గొన్నారు.
సమ్మె కాలంలో ఇచ్చిన మినిట్స్ కాపీలకు జీవోలివ్వాలి
అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment