
మహిళలు ధైర్యంగా ఫిర్యాదు చేయాలి
● ఎస్పీ ఏఆర్ దామోదర్
ఒంగోలు టౌన్: మహిళలు ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేసే వాతావరణం పోలీసు స్టేషన్లలో ఉండాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ పేర్కొన్నారు. మహిళలతో గౌరవంగా మాట్లాడినపుడే వారు తమ సమస్యలను ధైర్యంగా చెప్పడానికి అవకాశం ఉంటుందన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మహిళా ఎస్‌ఐలు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. మహిళల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, సత్వర పరిష్కారంపై పలు సూచనలిచ్చారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి పోలీసు స్టేషన్‌లోనూ ఉమెన్ హెల్ప్ డెస్క్ వద్ద ఒక హెడ్ కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. మహిళల సమస్యలు సావధానంగా విని వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని చెప్పారు. మహిళలపై నేరాలను అత్యంత ప్రాధాన్యత కలిగిన కేసులుగా పరిగణించాలని, తగిన సాక్ష్యాలు సేకరించి న్యాయం చేసేందుకు కృషి చేయాలన్నారు. సఖి వన్ స్టాప్ సెంటర్లను మహిళలు వినియోగించుకోవాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, డీసీఆర్బీ సీఐ దేవ ప్రభాకర్, టౌన్ మహిళా ఎస్సైలు షేక్ రజియా సుల్తానా, అనిత, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment