కుటుంబ సభ్యులే అంతమొందించారు
కంభం: కంభంలో సంచలనం రేపిన కదం శ్యాం ప్రసాద్ హత్య కేసులో కుటుంబ సభ్యులే పాత్రధారులని మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్‌లో మీడియా సమావేశం నిర్వహించి కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 14వ తేదీన సాయంత్రం కంభం పట్టణం జయప్రకాశ్ వీధిలోని ఇరిగేషన్ పంట కాల్వ గట్టు వెంబడి చిల్లచెట్ల మధ్య పసుపు రంగులో ఉన్న మూడు గోనె సంచులను పోలీసులు గుర్తించారు. అది కదం శ్యాంప్రసాద్(35) మృతదేహంగా నిర్ధారించుకుని విచారణ ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితులను మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకుని విచారించగా నేరం చేసినట్లు అంగీకరించారని డీఎస్పీ తెలిపారు.
కుటుంబ సభ్యులే హత్య చేశారు
కదం శ్యాంప్రసాద్ చెడు వ్యసనాలకు బానిసై పనికి వెళ్లకుండా, సంపాదన లేకుండా మద్యం సేవించి తిరుగుతుండేవాడు. బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ ఉన్న మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ గొడవపడేవాడు. గతంలో తన చిన్నమ్మలైన చిన్న వెంకుబాయి, పెద్ద వెంకుబాయిలతో అసభ్యకరంగా ప్రవర్తించగా పెద్దల సమక్షంలో పంచాయతీ చేసి మందలించారు. ఈనెల 8న తన తల్లితో అసభ్యకరంగా ప్రవర్తించగా అన్న సుబ్రమణ్యం, తమ్ముడు కాశీరావు తీవ్రంగా మందలించారు. 12వ తేదీ లారీ క్లీనర్‌గా కర్నూలు జిల్లా ఓర్వకళ్లుకు వెళ్లిన శ్యాం ప్రసాద్.. డ్రైవర్ ఉస్మాన్‌బాషాతో అక్కడ గొడవపడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లి, సోదరులు అక్కడికి వెళ్లి అతన్ని ఇంటికి తీసుకొచ్చారు. 13వ తేదీన తల్లి లక్ష్మీదేవి, అన్న సుబ్రమణ్యం, తమ్ముడు కాశీరావు కలిసి శ్యాం ప్రసాద్‌ను చంపేయాలని నిర్ణయించుకున్నారు. సుబ్రమణ్యం స్నేహితుడైన ఆటోడ్రైవర్ వల్లంశెట్టి మోహన్‌తో కలిసి అదే రోజు రాత్రి హత్య చేశారు.
గొడ్డలి, కత్తితో 8 ముక్కలుగా నరికారు
శ్యాంబాబును ఇంట్లో హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని బయటకు తీసుకెళ్లేందుకు తోపుడు బండ్లు, ఇతర వాహనం కోసం ప్రయత్నించగా అవి దొరకలేదు. మృతదేహం వాసన వస్తే చుట్టుపక్కల వారికి తెలిసిపోతుందని భావించి నలుగురూ కలిసి గొడ్డలి, కత్తితో 8 ముక్కలుగా నరికారు. మూడు గోతాల్లో శరీర భాగాలను కుక్కి ఎవరూ లేని సమయంలో మోసుకెళ్లి ఇంటికి సమీపంలో ఉన్న పంటకాల్వ వెంట పడేసి పరారయ్యారు. కాగా మంగళవారం నలుగురు నిందితులనూ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. మీడియా సమావేశంలో సీఐ కె.మల్లికార్జున, ఎస్సై నరసింహారావు పాల్గొన్నారు.
కంభంలో సంచలనం రేపిన యువకుడి హత్య కేసులో నిందితులు అరెస్టు
ఆటో డ్రైవర్‌తోపాటు తల్లి, ఇద్దరు సోదరుల హస్తం
కేసు వివరాలు వెల్లడించిన డీఎస్పీ నాగరాజు
కుటుంబ సభ్యులే అంతమొందించారు
Comments
Please login to add a commentAdd a comment