మిస్టరీగా మృతదేహాలు
ఒంగోలు టౌన్: ఒకే రోజు ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ ఇద్దరు కూడా అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవి సహజంగా జరిగిన రోడ్డు ప్రమాదాలేనా లేక ఎవరైనా కావాలని చేసిన హత్యలా అనేది మిస్టరీగా మారింది. ఇంతకూ ఏం జరిగిందంటే...సోమవారం అర్ధరాత్రి త్రోవగుంట గ్రామ పరిధిలోని గుంటూరు నెల్లూరు రోడ్డులో ఒక షోరూం ఎదురుగా రోడ్డు పక్కన 25 ఏళ్ల వయసు కలిగిన యువకుడి మృతదేహం పడి ఉన్నట్లు సమాచారం వచ్చిందని తాలుకా పోలీసులు చెబుతున్నారు. ఈ యువకుడి ఒంటిపై షర్టు లేదు. బ్లూ రంగు జీన్ ఫ్యాంట్ ధరించి ఉన్నాడు. ముక్కుపై గాయాలు కావడంతో రక్తస్రావం అయినట్లు కనిపిస్తుంది. అదే రోజు మరో యువకుడు కూడా ఇదే తరహాలో మరణించాడు. అదివారం అర్ధరాత్రి నగరంలోని వెంగముక్కలపాలెం జంక్షన్ దగ్గరలో ఒక యువకుడి మృతదేహం పోలీసులకు లభ్యమైంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా ఒంగోలు వైపు నుంచి వెళుతున్న కారు ఢీ కొనడంతో తల, నడుముకు తీవ్రమైన గాయాలు కావడంతో ఆ యువకుడు మృతి చెంది ఉంటాడని భావిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఇతడి ముక్కుపై కూడా గాయం అయి ఉండడం గమనార్హం. ముక్కు నుంచి రక్తం స్రవించిన గుర్తులు ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు మరణాల గురించి నగరంలో చర్చ సాగుతోంది. 17వ తేది అర్ధరాత్రి కాస్త అటు ఇటుగా ఒకే సమయంలో ఒకే వయసు కలిగిన ఇద్దరు యువకులు ఒకే తరహాలో మృతి చెందడం అనుమానాలను రేకిత్తిస్తుంది.
నిజంగానే ఈ యువకులు రోడ్డు ప్రమాదంలో మరణించారా లేక ఎక్కడైనా హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అనేది సందిగ్ధంగా మారింది. ప్రస్తుతానికి తాలుకా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దర్యాప్తులో కానీ నిజనిజాలు బయటపడవు.
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు గుర్తు తెలియని యువకుల మృతి
అనుమానాలకు తావిస్తున్న మరణాలు
ఒకే తరహాలో ముఖంపై గాయాలు
మరణాల వెనక మిస్టరీ ఏంటని చర్చించుకుంటున్న ప్రజలు
మిస్టరీగా మృతదేహాలు
Comments
Please login to add a commentAdd a comment