ధర దండిగా | - | Sakshi
Sakshi News home page

ధర దండిగా

Published Wed, Feb 19 2025 1:51 AM | Last Updated on Wed, Feb 19 2025 1:52 AM

ధర దండిగా

ధర దండిగా

ఆశలు పండగా..

చీమకుర్తి: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కలిపి మొత్తం 11 వేలం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. అందులో ఒంగోలు–1, ఒంగోలు–2, వెల్లంపల్లి, టంగుటూరు, కొండపి, పొదిలి, కనిగిరి, కందుకూరు–1, కందుకూరు–2, కలిగిరి, డీసీపల్లి కేంద్రాలు జిల్లా పరిధిలో ఉన్నాయి. ఈ వేలం కేంద్రాల్లో గత ఏడాది 88 మిలియన్‌ కేజీల పొగాకు కొనుగోలుకు బోర్డు అనుమతినివ్వగా రైతులు అనుమతికి మించి సాగు చేశారు. రైతుల విజ్ఞప్తి మేరకు 153 మిలియన్‌ కేజీల పొగాకును బోర్డు కొనుగోలు చేసింది. దానిని దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం పొగాకు సాగు విస్తీర్ణం కూడా పెరగటంతో అధికారకంగా బోర్డు 103 మిలియన్‌ కేజీలు కొనుగోలు చేసేందుకు అనుమతినిచ్చింది. రైతులు సాగు చేసిన విస్తీర్ణం ఎక్కువగా ఉండటంతో ఈ సారి కూడా బోర్డు నిర్ణయించిన దానికంటే గత ఏడాది కొనుగోలు చేసిన 153 మిలియన్‌ కేజీలను మించి పోతుందేమోనని బోర్డు అధికారులు అంచనాలు లెక్కగడుతున్నారు.

పెరుగుతూ వస్తున్న సాగు విస్తీర్ణం...

నాలుగేళ్లుగా వస్తున్న లాభాలతో పొగాకు సాగు చేసే రైతుల సంఖ్య, విస్తీర్ణం ఏటికేడు పెరుగుతూ వచ్చింది. ఈ సంవత్సరం 68,500 హెక్టార్లకు మించి పొగాకు సాగుచేయొవద్దని బోర్డు అధికారులు రైతుల చెవిలో గూడుకట్టుకొని ప్రచారం చేసినా లాభాల ఊహల్లో తేలుతున్న రైతులు వారి సూచనలను పెడచెవిన పెట్టారు. ఏకంగా 88 వేల హెక్టార్లలో సాగు చేశారు. అంటే బోర్డు అధికారులు చెప్పిన విస్తీర్ణం కంటే 28 శాతం ఎక్కువ సాగు చేశారు. జిల్లాలోని 11 వేల కేంద్రాల పరిధిలో మొత్తం 24 వేల బ్యారన్‌ల ద్వారా 30 వేల మంది రైతులు పొగాకు సాగు చేస్తున్నారు. గతంలో కాడి కింద పడేసిన రైతులు సైతం తమకున్న పొలంతో పాటు ఇతరుల పొలాన్ని కూడా కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. బ్యారన్‌లను అద్దెలకు తీసుకొని మరీ సాగు చేయటానికి రైతులు ఉత్సాహం చూపుతున్నారు. ఎకరం పొలం కౌలు గతంలో రూ.10 వేలు ఉండేది. ఇప్పుడు రూ.20 వేలకు పెరిగింది. గతంలో బ్యారన్‌ కౌలు రూ.50 వేల నుంచి 60 వేల మధ్య ఉండేది, అది కాస్త ఇప్పుడు రూ.1.50 లక్షల నుంచి 1.80 లక్షలకు పెరిగింది.

ఈ నెల 25 అధికారుతో సమావేశం:

రాష్ట్ర పొగాకు బోర్డు ఉన్నతాధికారులతో జిల్లాలోని 11 వేల కేంద్రాలకు సంబంధించిన అధికారులతో ఈ నెల 25న సమావేశం జరగనుందని బోర్డు అధికారులు సూచనప్రాయంగా తెలిపారు. ఆ సమావేశంలో జిల్లాలోని వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్లు ఎప్పుడు ప్రారంభం కావాలో అనే అంశంపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

రైతులను వేధిస్తున్న మల్లె..

పొగాకు సాగులో వేళ్ల మీద పెరిగే మల్లె రైతులను వేధిస్తోంది. ఇది మొక్కలు ఏపుగా పెరగటంలో ఆటంకం కలిస్తుందని రైతులు, బోర్డు అధికారులు చెబుతున్నారు. దాంతోపాటు ఇటీవల కురిసిన ముసురు వర్షాలు, దాని వలన ఏర్పడిన తెగుళ్ల వలన కూడా పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే రైతులు పొగాకు సాగులో రూ.లక్షలు ఖర్చుపెట్టారు. తెగుళ్ల వలన దెబ్బతిని పోయిన పంట పోయినా ఉన్న పొగాకుకు మంచి నాణ్యమైన రంగు వస్తే మంచి ధర పలుకుతుందనే ధీమాలో రైతులు ఆశలు పెంచుకున్నారు. కర్నాటకలోని ధరలు రైతుల్లో ఇంకాస్త ఊపిరిపోశాయి.

కర్నాటక రేట్లతో పొగాకు రైతుల్లో ఆశలు అక్కడ కేజీ పొగాకు గరిష్ట ధర రూ.331 గత ఏడాది మన జిల్లాలో గరిష్ట ధర రూ.320 ఇప్పటికే లక్ష్యానికి మించి పొగాకు సాగు 68,500 హెక్టార్లకు అనుమతి ఇవ్వగా 88 వేల హెక్టార్లలో సాగు 103 మిలియన్‌ కేజీలు కొనుగోలుకు అనుమతి కొనుగోలు తేదీపై స్పష్టత ఈనెల 25 తేదీన

కర్నాటకలో మంచి ధరలు వస్తున్నాయి

కర్నాటకలో పొగాకుకు మంచి ధరలు వస్తున్నాయి. కేజీ పొగాకు గరిష్టంగా రూ.331, సరాసరిన రూ.268 పలికింది. లోగ్రేడు కూడా రూ.220కు పైగా ధర పలుకుతోంది. దానిని బట్టి మన జిల్లాలోని పొగాకుకు మంచి ధరలు రావచ్చని అంచనా ఉంది. కానీ రైతులకు 68,500 హెక్టార్లలో పొగాకు సాగు చేయాలని అనుమతినిస్తే వారు మాత్రం ఏకంగా 88 వేల హెక్టార్లలో సాగు చేశారు. దాని ప్రభావం ఎలా ఉంటుందో వేలం మొదలైతే గానీ చెప్పలేం.

– ఆర్‌.లక్ష్మణ్‌రావు, ఆర్‌.ఎం, ఒంగోలు పొగాకు బోర్డు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement