కూటమి షాక్!
మీటర్ రీడర్లకు
కంభం:
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు చిరుద్యోగుల పాలిట శాపాలుగా మారుతున్నాయి. పాలకులు అమలు చేస్తున్న ఒక్కో నిర్ణయం ఒక్కో శాఖలో పనిచేసే చిరుద్యోగుల పొట్టకొట్టేలా ఉండటంతో ఎవరి ఉద్యోగాలు ఉంటాయో.. ఎవరివి ఊడిపోతాయో అంతుచిక్కడం లేదు. గతంలో ఉన్న కరెంటు మీటర్ల స్థానంలో ప్రస్తుతం రీచార్జ్ స్మార్ట్ మీటర్లు బిగిస్తుండటంతో గడిచిన 18 ఏళ్లుగా విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న మీటర్ రీడర్ల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది.
మీటర్ రీడర్లు 2001వ సంవత్సరం నుంచి విధులు నిర్వహిస్తున్నారు. అంతకు ముందు మాన్యువల్ విధానంలో బిల్లులు ఇస్తుండగా 2001లో మీటర్ రీడర్స్ బిల్లులు ఇవ్వడం ప్రారంభించారు. 2001లో రూరల్ ప్రాంతంలో ఒక బిల్లుకు 75 పైసలు, పట్టణంలో ఒక బిల్లుకు రూ.50 పైసల నుంచి మొదలై ప్రస్తుతం రూరల్‌లో ఒక బిల్లుకు రూ.3.10 పైసలు, పట్టణంలో రూ.3.00 చొప్పున చెల్లిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం జనవరి నుంచి కొత్త కాంట్రాక్టర్ల ద్వారా ఇదే విధంగా ఇస్తున్నారు.
స్మార్ట్ మీటర్లతో భవిష్యత్ ప్రశ్నార్థకం
గత రెండు నెలల నుంచి ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలు, వాణిజ్య సంస్థలు, పరిశ్రమల్లో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించారు. అవి పూర్తయిన వెంటనే గృహాల్లో స్మార్ట్ మీటర్లు బిగించే ప్రక్రియ ప్రారంభం కానుంది. స్మార్ట్ మీటర్లు బిగించడం పూర్తయితే జిల్లాలో పనిచేస్తున్న 250 మంది మీటర్ రీడర్ల ఉద్యోగాల్లో గాల్లో దీపాల్లా మారిపోతాయి. తమ ఉద్యోగ భధ్రత కోసం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో పాటు మంత్రులు నారాలోకేష్, పవన్ కళ్యాణ్ వద్ద గోడు వెళ్లబోసుకున్నా మీటర్ రీడర్లకు భవితకు హామీ లభించలేదు. స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడం లేదని మంత్రులు సర్దిచెప్పి పంపడంపై మీటర్ రీడర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కమర్షియల్ స్మార్ట్ మీటర్లు బిగించేస్తున్నారని, ఆ తర్వాత గృహాల్లో ఏర్పాటు చేస్తారని, అప్పుడు తమను కరివేపాకులా తీసి పడేస్తారని వాపోతున్నారు. గత 18 ఏళ్లుగా పనిచేస్తున్న మీటర్ రీడర్లకు విద్యుత్ సంస్థలోనే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించి కనీస వేతనం అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని మీటర్ రీడర్లు డిమాండ్ చేస్తున్నారు.
నేడు విజయవాడలో మహాసభ
రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 4 వేల మంది మీటర్ రీడర్ల ఉద్యోగ భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ ఆధ్వర్యంలో విజయవాడలో రాష్ట్రస్థాయిలో మహాసభ నిర్వహించనున్నారు. ఈ మహా సభలో ఉద్యోగ భద్రత కోసం చేయాల్సిన పోరాటాలు, భవిష్యత్ కార్యాచరణ ప్రకటన తదితర అంశాలపై చర్చించనున్నట్లు సంఘ నాయకులు చెబుతున్నారు. మహసభలు విజయవంతం చేయాలని కోరుతూ ఇప్పటికే మహాసభలపై ప్రచారం నిర్వహించిన మీటర్ రీడర్లు విజయవాడకు పయనమయ్యారు.
చిరుద్యోగుల పొట్టకొట్టేలా కూటమి ప్రభుత్వం అడుగులు
స్మార్ట్ మీటర్ల రాకతో విద్యుత్ మీటర్ రీడర్ల భవిష్యత్ ప్రశ్నార్థకం
జిల్లాలో 20 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న 250 మంది మీటర్ రీడర్లు
భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతున్న ఉద్యోగులు
నేడు విజయవాడలో రాష్ట్ర స్థాయి మహాసభ
కూటమి షాక్!
Comments
Please login to add a commentAdd a comment