బిడ్డతో సహా తల్లి బలవన్మరణం
చెరువులో దూకి
● మతిస్థిమితం లేకనే అంటున్న కుటుంబ సభ్యులు
సంతనూతలపాడు:
ఎనిమిది నెలల పసిబిడ్డతో సహా తల్లి చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంతనూతలపాడులో బుధవారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. సంతనూతలపాడుకు చెందిన బాపట్ల వెంకటేషన్‌కు బోడపాలెం గ్రామానికి చెందిన సుజాత(28)తో నాలుగున్నరేళ్ల క్రితం వివాహమైంది. వీరు స్థానిక ముద్రగడ బజారులోని అంకమ్మ దేవాలయం సమీపంలో నివాసం ఉంటున్నారు. సురేష్ గొర్రెలను పెంచుతూ కుటుంబాన్ని వెళ్లదీస్తున్నాడు. వీరికి తొలుత ఆడబిడ్డ జన్మించగా అనారోగ్యంతో రెండేళ్ల క్రితం మృతి చెందింది. అనంతరం 8 నెలల క్రితం మరో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఏడాది క్రితం వెంకటేష్‌కు చెందిన రూ.లక్షల విలువైన పశువులు అంతు చిక్కని వ్యాధులతో మరణించాయి. దీంతో ఆ కుటుంబాన్ని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి.
ఈ నేపథ్యంలో అప్పులు ఎలా తీర్చాలి అనే దిగులుతో పాటు.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుజాత మతిస్థిమితం లేక.. బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున స్థానిక చెరువులో చంటి బిడ్డ బాపట్ల ఏశ్వజ్ఞ (8నెలలు) మృతదేహం బయటపడడంతో ఈ విషయం వెలుగు చూసింది.
తల్లీబిడ్డల ఆత్మహత్యపై సమాచారం అందుకున్న సంతనూతలపాడు ఎస్‌ఐ అజయ్ కుమార్ గాలింపు చర్యలు చేపట్టి మహిళ మృతదేహాన్ని చెరువులోంచి బయటకు తీయించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. తల్లీబిడ్డ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment