మహిళల భద్రత మనందరి బాధ్యత
● ఎస్పీ ఏఆర్ దామోదర్
ఒంగోలు సిటీ: మహిళల భద్రత మనందరి బాధ్యత అని, మహిళా ఫిర్యాదుల పరిష్కారానికి ఎల్లప్పుడు సంసిద్ధంగా ఉండాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ పేర్కొన్నారు. బుధవారం ఒంగోలులోని పోలీస్ కల్యాణ మండపంలో అన్ని పోలీస్ స్టేషన్ల మహిళా సిబ్బందితో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే మహిళా ఫిర్యాదుదారులతో పోలీసులు వ్యవహరించాల్సిన విధానంపై దిశానిర్దేశం చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్లో ఉమెన్ హెల్ప్ డెస్క్ వద్ద మహిళా సిబ్బంది ఉండాలని చెప్పారు. మహిళలు, బాలలు పోలీస్ స్టేషన్‌కు వచ్చి నిర్భయంగావారి ఫిర్యాదు చేయగలిగే వాతావరణాన్ని కల్పించాలన్నారు. మహిళలతో గౌరవంగా మాట్లాడాలని, వారి సమస్యలను ఓపికగా వినాలని హితవు పలికారు. ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించడానికి అన్ని విధాలా ప్రయత్నించాలని సూచించారు. అవసరమైన సాక్ష్యాలు సేకరించి భద్రపరచాలన్నారు. మహిళల ఫిర్యాదులను గోప్యంగా ఉంచాలని, వారి వ్యక్తిగత సమాచారం, కేసు వివరాలను ఎవరితోనూ పంచుకోకూడదని స్పష్టం చేశారు. మహిళా హెల్ప్ డెస్క్ వద్ద తగిన మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. న్యాయ సహాయం, వైద్య సహాయం అందించడానికి కూడా సిద్ధంగా ఉండాలన్నారు. మహిళలు, పిల్లల కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా దర్యాప్తు చేయాలన్నారు. పాఠశాలలు, కళాశాలలకు పోలీసు సిబ్బంది వెళ్లి గుడ్ టచ్–బ్యాడ్ టచ్, ఆకర్షణ ప్రేమ ప్రభావాలు, బాల్య వివాహాలు, ఈవ్ టీజింగ్, స్వీయ రక్షణలపై అవగాహన కల్పించాలన్నారు. మహిళా సిబ్బంది సంక్షేమం దృష్ట్యా ప్రతి పోలీస్ స్టేషన్‌లోనూ ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, ప్రత్యేక మెడికల్ క్యాంపులు సైతం నిర్వహిస్తున్నామన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) కె.నాగేశ్వరరావు, డీసీఆర్బీ సీఐ దేవ ప్రభాకర్, ఆర్‌ఐలు రమణారెడ్డి, సీతారామిరెడ్డి, ఒంగోలు టౌన్ మహిళా ఎస్సైలు రజియా సుల్తాన్, అనిత, కష్ణ పావని, సువర్ణ, ఆర్‌ఎస్సై సురేష్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment