అంకెల గారడీతో..
ఒంగోలు నగర వ్యూ
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
అంకెల గారడీతో ప్రజలను మభ్యపెట్టేందుకు నగర పాలకులు చేసిన ప్రయత్నం బడ్జెట్ సమావేశంలో స్పష్టంగా కనిపించింది. పేరుకు వందల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టిన నగర పాలకులు..సమావేశంలో జరిగిన చర్చలో మాత్రం ఆదాయ మార్గాల గురించి ప్రధానంగా దృష్టి సారించడం గమనార్హం. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగాలేదని చెప్పిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్...ప్రజల నుంచి రావాల్సిన వివిధ రకాల పన్నులను మొత్తం వసూలు చేయాల్సిందేనంటూ పదే పదే చెప్పడం గమనార్హం. ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భారీ మొత్తంలో గ్రాంట్లు వస్తాయని ఆశలు చూపుతూనే..మరోవైపు ప్రజలపై ఎన్ని రకాల పన్నులు వేయవచ్చో ఆరా తీయడం సభ్యులను విస్మయానికి గురిచేసింది. మొత్తం మీద ప్రజలను బురిడీ కొట్టించేందుకు నానా తంటాలు పడిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు రూ.210 కోట్ల బడ్జెట్ పేరుతో ప్రజల చెవిలో పూలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారు.
రూ.210 కోట్ల బడ్జెట్...
నగరపాలక సంస్థ 2025–26 బడ్జెట్‌ను రూ.210.79 కోట్లతో ఆమోదించారు. ఇందులో ఖర్చులు రూ.196 కోట్లు కాగా మిగులు బడ్జెట్ రూ.13.98 కోట్లుగా తేల్చారు. పైకి చూసేందుకు ఈ బడ్జెట్ రంగుల కలలను ఆవిష్కరిస్తుంది. వాస్తవంలోకి వచ్చి చూస్తే ఒట్టి చేతులు మాత్రమే మిగులుతాయని ప్రజా సంఘాల నాయకులు చెబుతున్నారు. ఈ రూ.210 కోట్ల బడ్జెట్లో ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న భవన నిర్మాణ క్రమబద్ధీకరణ (బీపీఎస్) బకాయిలు రూ.10 కోట్లను కూడా చూపారు. నిజానికి 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకాన్ని పెట్టారు. అప్పుడు ఇవ్వాల్సిన బకాయిలను ఇవ్వకపోవడంతో అది పెండింగ్‌లో ఉండిపోయింది. అయితే ఒంగోలు మున్సిపాలిటీగా ఉన్నప్పుడు కూడా బడ్జెట్లో ఈ బకాయిలను చూపించేవారని, ఇప్పుడు కూడా ఆ నాటి బకాయిలను చూపించడం ఎంత వరకు సమంజసమో ఆలోచించాలని అధికార పార్టీ కార్పొరేటర్లు చెవులు కొరుక్కుంటున్నారు. ఇకపోతే కేంద్ర, రాష్ట్ర గ్రాంట్లపైనే పాలకవర్గం ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. ఏకంగా రూ.52.20 కోట్ల గ్రాంట్లు వస్తాయని ఈ బడ్జెట్లో అంచనా వేశారు. ఒక వైపున కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్ ప్రవేశపెట్టింది. అందులో రాష్ట్రానికి ఒట్టి చేతులు చూపింది. అమరావతి నిర్మాణం గురించి సైతం కనీసం ప్రస్తావించలేదు. అలాంటిది నగర పాలక సంస్థలకు గ్రాంట్లు ఇవ్వడం అనేది భ్రమ మాత్రమేనని మేధావులు చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే రూ.లక్ష కోట్లు అప్పులు చేసి రికార్డు సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు నిధులు గానీ, గ్రాంట్లు గానీ ఇచ్చే పరిస్థితి లేదు. ఈ విషయం తెలుసు కనుకనే నిధుల మంజూరు కోసం సీఎం చంద్రబాబు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చుట్టూ తిరుగుతున్నానని ఎమ్మెల్యే దామచర్ల చెప్పడం గమనించవచ్చు.
మంచినీటికే రూ.15 కోట్లే...
నగరం రోజురోజుకు విస్తరిస్తోంది. జనాభా సైతం పెరిగిపోతోంది. వేసవికి ముందే నగరంలో మంచినీటి సమస్య తలెత్తనుంది/ కనుక ఇతరత్రా వృథా ఖర్చులను తగ్గించుకొని ఆ డబ్బులతో ప్రజలకు మంచినీరు అందించాలని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ ఇమ్రాన్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకపోగా పాలక పార్టీ సభ్యులు, ఎమ్మెల్యే దామచర్ల ఆయనపై ఎదురుదాడికి దిగారు. నెమళ్లు, గుర్రాల బొమ్మలకు లక్షలు ఖర్చు చేస్తున్న పాలకవర్గం ప్రజలకు గుక్కెడు మంచినీళ్లు అందించేందుకు సంసిద్ధంగా లేకపోవడం విచారకరమని ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
నగరపాలక సంస్థ బడ్జెట్ అంతా కాకి లెక్కలే..! 2017 బీపీఎస్ బకాయిలను ఈ బడ్జెట్లో చూపిన వైనం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లపై ఆశలు రూ.210 కోట్ల పద్దులో ఖర్చులకే రూ.196 కోట్లు వేతనాలు, ఇతర నిర్వహణ ఖర్చులకు సుమారు రూ.100 కోట్లు ప్రజలపై పన్నుల భారం కుట్ర
బకాయిల కోసం దుకాణాలు కూల్చివేస్తారా?
ఆదాయ మార్గాల గురించి ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ కొత్త కూరగాయల మార్కెట్ కూల్చివేత గురించి ప్రస్తావించారు. ఇటీవల కొత్త కూరగాయల మార్కెట్లో దుకాణాలను నగర పాలక సంస్థ కూల్చివేయడం తెలిసిందే. గత ఇదేళ్లుగా మార్కెట్‌లోని వ్యాపారులు అద్దెలు చెల్లించకపోవడంతో బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోయాయాని ఎమ్మెల్యే చెప్పారు. మొత్తం బకాయిలు రూ.12 కోట్ల వరకు ఉందని, వివిధ మార్గాల ద్వారా అధికారులు ఒత్తిడి తీసుకుని వస్తే రూ.54 లక్షలు వసూలయ్యాయని సభకు వివరించారు. ఈ విషయంపై వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ ఇమ్రాన్‌ఖాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. బకాయిలు ఉంటే దుకాణాలను ఖాళీ చేయించి టెండర్ వేసి మరొకరికి అద్దెకు ఇవ్వాలి గానీ కూల్చివేయడం సమర్ధనీయం కాదని నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment