గంటలోనే ముగించేశారు..!
ఒంగోలు టౌన్: నగరపాలక సంస్థ కీలకమైన బడ్జెట్ సమావేశం. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం ఎక్స్ ఆఫీషియో సభ్యులైన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయకుమార్‌లు 3 గంటలు ఆలస్యంగా రావడంతో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైంది. పోనీ అలస్యంగానైనా ప్రారంభించినా కీలకమైన బడ్జెట్ సమావేశంలో ఏమైనా చర్చించారా అంటే అదీ లేదు. మొక్కుబడిగా గంట పాట నిర్వహించి మమ అనిపించి చేతులు దులుపేసుకున్నారు. సమావేశంలో ప్రజల సమస్యలు తలెత్తిన సభ్యులపై ఎమ్మెల్యే దామచర్ల ఎదురుదాడికి దిగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజల నుంచి పన్నులు వసూలు చేయాల్సిందే
నగర ప్రజల నుంచి రావాల్సిన కోట్లాది రూపాయల పన్ను బకాయిలను వసూలు చేయాల్సిందేనంటూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అధికారులను ఆదేశించారు. 2024–25 సంవత్సరానికి గాను సవరించిన బడ్జెట్‌ను, 2025–26 సంవత్సరం బడ్జెట్ అంచనాలను కలుపుకొని రూ.210 కోట్ల బడ్జెట్‌ను సమావేశంలో ఆమోదించినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మంచినీటి సమస్యను ప్రస్తావించిన వైఎస్సార్ సీపీ సభ్యులపై ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పరోక్ష విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలకు గతంలో వైఎస్సార్ సీపీలో గెలిచి ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్న మేయర్ గంగాడ సుజాత, ఇతర పాలకవర్గ సభ్యులు నివ్వెరపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నగరాన్ని గాడిలో పెడుతున్నామని చెప్పుకొచ్చారు.
రోడ్డుపై చెత్త వేస్తే జరిమానా...
నగర ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి ఆదాయాన్ని పెంచాలని ఎమ్మెల్యే దామచర్ల సూచించారు. ప్రజల నుంచి సక్రమంగా పన్నులు వసూలు చేయకపోవడంతో బకాయిలు పేరుకొని పోయాయని చెప్పిన ఆయన కొత్త కూరగాయల మార్కెట్లో రూ.12 కోట్ల అద్దె బకాయిలను ప్రస్తావించారు. ప్రజలు రోడ్లపై చెత్త వేస్తే జరిమానా వేయాలని అధికారులకు సూచించారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి కేవలం 8 నెలలు మాత్రమే అయ్యిందని, అపుడే విమర్శలు చేయడం మంచి సంస్కృతి కాదని మండిపడ్డారు. గత ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేసిందని, మా ప్రభుత్వం కూడా త్వరలోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని చెప్పారు. నిధుల కోసం ముఖ్యమంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి చుట్టూ తిరుగుతున్నానని చెప్పుకున్నారు.
మంచినీటి సమస్య ప్రస్తావించకూడదా..?
నగరంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని, బడ్జెట్లో మంచినీటి సమస్య పరిష్కారానికి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్, ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ ఖాన్ ప్రస్తావించారు. నగర శివారు ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నా సరిపోవడం లేదని సభ దృష్టికి తీసుకువచ్చారు. గత ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే ఒంగోలు నగరంలోని శివారు ప్రాంత ప్రజలకు మంచి నీరు అందించేందుకు రూ.15 కోట్లు కేటాయించిందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయడానికి ఒక్క రూపాయి ఖర్చు చేయలేదని, నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు కేవలం రూ.15 కోట్లు మాత్రమే కేటాయించిందని చెప్పారు. దీంతో టీడీపీ సభ్యులు ఒక్కసారిగా లేచి విమర్శలు గుప్పించడం మొదలు పెట్టారు. బడ్జెట్ సమావేశంలో మంచి నీటి సమస్య గురించి ఎలా మాట్లాడతారని అడ్డగోలుగా వాదించారు. వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ ఇమ్రాన్ మాట్లాడుతున్నా వినిపించుకోకుండా గొడవ చేశారు. అయినా ఇమ్రాన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఒంగోలు నగరంలో మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అమృత్ 2.0లో భాగంగా రూ.350 కోట్లు కేటాయించిందని, ప్రస్తుత బడ్జెట్లో దాని ప్రస్తావన లేదని చెప్పారు. మున్సిపల్ లైట్ అండ్ హెవీ వెహికల్ మరమ్మతుల కోసం రూ.2 కోట్లు, డంపింగ్ యార్డ్ నిర్వహణ కోసం రూ.70 లక్షలు కేటాయించారని, ఇలాంటి వాటి ఖర్చు తగ్గించుకొని మంచినీటి కోసం వెచ్చించాలని సూచించారు. అయినా టీడీపీ సభ్యులు మూకుమ్మడిగా మాట్లాడుతుండటంతో ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా పోయింది. బడ్జెట్ సమావేశం ప్రారంభిస్తూ సభ్యులు ఏమైనా సలహాలు, సూచనలు ఇవ్వాలని మేయర్ కోరారాని, సూచనలు ఇస్తుంటే టీడీపీ సభ్యులు అడ్డు తగులుతున్నారని ఇమ్రాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష సభ్యులను మాట్లాడవద్దంటే ఎలా అని ప్రశ్నించారు. ఆ తరువాత మాట్లాడిన ఎమ్మెల్యే దామచర్ల వైఎస్సార్ సీపీ సభ్యుడు ఇమ్రాన్ లేవనేత్తిన అంశాలకు జవాబు ఇవ్వకుండా విమర్శలు చేశారు. మైకు చేతిలో ఉందని ఏది పడితే అది మాట్లాడితే నేను కూడా మాట్లాడగలను అంటూ మండిపడ్డారు. మొత్తం మీద ఒకరిద్దరు సభ్యులకు మాత్రమే మాట్లాడే అవకాశం ఇచ్చి బడ్జెట్ ఆమోదించినట్లు మేయర్ ప్రకటించారు. సమావేశంలో కమిషనర్ వెంకటేశ్వరరావు, అధికారులు పాల్గొన్నారు.
నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశానికి 3 గంటలు ఆలస్యంగా వచ్చిన ఎమ్మెల్యేలు గంటలోనే సమావేశం ముగింపు కీలకమైన బడ్జెట్ సమావేశంపై చర్చ లేకుండానే ముగింపు సమస్యలు ప్రస్తావించిన సభ్యులపై ఎదురుదాడి నిధుల కోసం సీఎం చుట్టూ తిరుగుతున్నానంటూ ఎమ్మెల్యే దామచర్ల వ్యాఖ్యలు
గంటలోనే ముగించేశారు..!
Comments
Please login to add a commentAdd a comment