
తేళ్ల అరుణ
ఒంగోలు మెట్రో/మార్కాపురం: ‘తిక్కన పద్యమొక్కటి చక్కగ చదివిన చాలు తెలుగుజాతి నుడికారము తెలిసికొన్న యటౌను’ తెలుగు నుడికారం గొప్పదనాన్ని వివరిస్తూ దాశరథి పేర్కొన్న మాటలివి. నుడికారమనేది పద్యాలకు, కావ్యాలకు, గ్రంథాలకు, కవులకు, పండితులకే పరిమితం కాదు. నుడికారానికి ముడిసరుకు మనం మాట్లాడే భాషే. నుడికారమనేది పండితులకంటే ముందు పామరుడి సొత్తు. మాటల్లోని చమత్కారం అర్థం కావాలంటే ఆ మాటలు పుట్టిన సమాజంలో పుట్టి పెరగాల్సి ఉంటుంది.
భాష ఒకటే అయినప్పటికీ ప్రాంతాన్ని బట్టి, ప్రజల జీవనాన్ని బట్టి నుడికారం మారుతుంది. 2 వేల ఏళ్ల చరిత్ర కలిగిన తెలుగు భాష గొప్పదనాన్ని గ్రహించి, మాతృ భాషను బతికించుకోవాల్సిన బాధ్యత తెలుగు గడ్డపై పుట్టిన ప్రతి పౌరుడికీ ఉంది. ఏటా ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం నిర్వహించాలని 1999 నవంబర్ 17న యునెస్కో ప్రకటించింది. ప్రపంచంలో చిన్న, పెద్ద భాషలన్నిటినీ రక్షించుకోవడం ద్వారానే మనం సాంస్కృతిక, జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలమని యునెస్కో పేర్కొంది. శుక్రవారం అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం సందర్భంగా సాహిత్య సేద్యం చేస్తున్న జిల్లా ప్రముఖుల అభిప్రాయాలతో ప్రత్యేక కథనం..
అన్ని తరగతుల్లో తెలుగు బోధించాలి
ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు తెలుగు ఒక సబ్జెక్ట్‌గా ఉండాలి. ,అందులో కనీసం 50 శాతం మార్కులు వస్తేనే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినట్టుగా జీవో ఇవ్వాలి. పిల్లలతో తెలుగు పుస్తకాలు చదివించే అలవాటు చేయాలి. ప్రభుత్వ, కార్పొరేట్ స్కూళ్లలో తెలుగు సాహిత్యంపై పోటీలు నిర్వహించాలి.
– తేళ్ల అరుణ, న.ర.సం గౌరవాధ్యక్షురాలు
భాష.. మనిషికి శ్వాస
మన అస్తిత్వాన్ని తెలిపేది భాష. అలాంటి భాషను ప్రాణంగా భావించి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు ప్రజలతోపాటు ప్రభుత్వాలు సైతం బాధ్యత తీసుకోవాలి. పరభాషలపై మోజును వదిలిపెట్టాలి.
– డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ, కవి, రచయిత
శతకాల రచయిత అన్నపురెడ్డి
వయోజన విద్యాశాఖలో రీజినల్ జాయింట్ డైరెక్టర్‌గా రిటైరైన డాక్టర్ అన్నపురెడ్డి వీరారెడ్డి తెలుగు సాహిత్యంలో అక్షర సేద్యం చేస్తున్నారు. వంద రోజుల్లో తెలుగు నేర్చుకోవడం ఎలా అనే పుస్తకం ఇతర రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందింది. సుమారు 5 లక్షల మంది ఈ పుస్తకాన్ని చదివినట్లు అంచనా. 2001–02లో ఈ పుస్తకం ప్రచురితం కాగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. పశ్చిమ ప్రకాశంలో గ్రామ నామాలపై లోతైన పరిశోధన చేసి పుస్తక రూపంలోకి తెస్తున్నారు. ఇది ఆకాశవాణిలో ధారావాహికగా ప్రసారమవుతోంది.అక్షర తపస్వి, మహోపాధ్యాయ బిరుదులు అందుకున్న ఆయన పదుల సంఖ్యలో శతకాలు రచించారు.
మాతృభాషా పరిరక్షణ అందరి బాధ్యత
భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం మన మాతృ భాషలను సంరక్షించుకోగల్గుతామని అందరూ గ్రహించాలి. తల్లి లాంటి మాతృ భాష అభివృద్ధికి అందరూ కృషి చేయాలి. మాతృభాషలో చదువుకున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నా.
– డా.నూనె అంకమ్మరావు, కళామిత్ర మండలి జాతీయ అధ్యక్షుడు
కవిత్వమంటే శాస్త్రికి ప్రాణం
సాధన డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాగా పనిచేస్తున్న డాక్టర్ కప్పగంతుల మధుసూధన శాస్త్రి తెలుగు సాహిత్యంపై 200కు పైగా చేసిన రచనలు, వ్యాసాలు జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. 130కి పైగా ఆకాశవాణిలో ఉపన్యాసాలు ప్రసారమయ్యాయి. బతుకుబండి పేరుతో స్వీయ కవితా సంపుటి, కరుణశ్రీ సాహిత్యంలో మానవత్వం, ప్రకాశం జిల్లాలో అవధాన కళపై రెండు పరిశోధనా గ్రంథాలను ఆయన రచించారు. ప్రకాశం జిల్లాలో అవధాన కళపై డాక్టరేట్ పొందారు.
తెలుగు భాష ఘనమైనది
చిన్నప్పటి నుంచే పిల్లలకి తెలుగు పద్యాలు నేర్పడం వల్ల వారిలో భాషాభిమానం ఏర్పడుతుంది. సుమతి శతకం, వేమన శతకము మొదలైనవి తేలికగా అర్థమవుతాయి. మహాకవి ధూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతకం వల్ల సామాజిక జ్ఞానం ఏర్పడుతుంది. కృష్ణవేణి చరితం, గుండ్లకమ్మ చరితం, శంకర విజయం మొదలైన నృత్య రూపకాలు రచించి తెలుగు భాష రుణం కొంత తీర్చుకున్నానని భావిస్తున్నా.
– నెమ్మాని సీతారామమూర్తి, గిడుగు సాహితీ పురస్కార గ్రహీత

డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ
Comments
Please login to add a commentAdd a comment