
23న జిల్లా స్థాయి హాకీ జట్టు ఎంపిక
సంతనూతలపాడు: జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలులోని డీఆర్‌ఆర్‌ఎం మున్సిపల్ హైస్కూల్లో ఈ నెల 23న సీనియర్ పురుషుల హాకీ జట్టును ఎంపిక చేయనున్నట్లు అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఏవీ రమణారెడ్డి, ఎ.సుందరరామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రంతో ఉదయం 9 గంటలకు రావాలని సూచించారు. 1991 జనవరి ఒకటో తేదీ తర్వాత జన్మించిన వారు అర్హులని స్పష్టం చేశారు. వివరాలకు 9666067764ను సంప్రదించాలని సూచించారు.
26న రామాపురంలో
ఎడ్ల పోటీలు
రాచర్ల: మండలంలోని గుడిమెట్ట పంచాయతీ పరిధిలోని రామాపురం గ్రామ సమీపంలోని సిద్ధిభైరవేశ్వరస్వామి వారి తిరునాళ్ల మహోత్సవం సందర్భంగా ఈ నెల 26వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ధర్మకర్త మదిరె శ్రీరంగారెడ్డి, ఉప ధర్మకర్త శ్రీరంగపు వెంకటనారాయణరెడ్డి తెలిపారు. ఆసక్తి ఉన్న ఎడ్ల యజమానులు 26వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోగా 500 రూపాయలు ప్రవేశ రుసుం చెల్లించి పేరు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. పోటీల విజేతలకు మొదటి బహుమతి రూ.50 వేలు, రెండో బహుమతిగా రూ.30 వేలు, మూడో బహుమతి రూ.20 వేలు, నాలుగో బహుమతి రూ.10 వేలు అందజేస్తామని వివరించారు. వివరాలకు 94408 91465ను సంప్రదించాలని సూచించారు.
‘వెలిగొండ’కు రూ.2 వేల కోట్లు కేటాయించాలి
ఒంగోలు టౌన్: అసెంబ్లీలో త్వరలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్లో వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడానికి, నిర్వాసితుల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ సమస్య పరిష్కారానికి 2 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని సీపీఐ జిల్లా సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం కలెక్టర్ తమీమ్ అన్సారియాకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం నమోదవుతున్నప్పటికీ ప్రకాశం జిల్లా మాత్రం నిత్య కరువుతో అల్లాడుతోందని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే ప్రకాశం జిల్లాతోపాటు నెల్లూరు, కడప జిల్లాల్లోని 36 మండలాలు కరువు నుంచి బయట పడతాయన్నారు. 4.5 లక్షల ఎకరాలకు సాగు నీరు, 20 లక్షల మందికి తాగు నీరు అందుతుందని చెప్పారు. అసంపూర్తిగా ఉన్న కెనాల్ పనుల పూర్తి కోసం 4 వేల కోట్లు అవసరం అవుతాయని ఇంజినీర్లు చెబుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు కూటమి నాయకులు 2026 కల్లా ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని, అందుకు తగిన చర్యలు తీసుకుని చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. కార్యక్రమంలో వడ్డే హనుమా రెడ్డి, కె.వీరారెడ్డి, శ్రీరాం శ్రీనివాసులు పాల్గొన్నారు.
భర్త పురుగుమందు తాగాడని..
● డయల్ 100కు ఫోన్ చేసిన భార్య
● పరుగులు తీసిన మద్దిపాడు పోలీసులు
మద్దిపాడు: తన భర్త పురుగుమందు తాగాడంటూ ఓ మహిళ డయల్ 100కు ఫోన్ చేయడంతో మద్దిపాడు పోలీసులు పరుగులు తీశారు. వివరాల్లోకి వెళ్తే.. అద్దంకి మండలం ధర్మవరం గ్రామానికి చెందిన బండి రోశయ్య తాను పురుగుల మందు తాగానని, మద్దిపాడు సమీపంలోని కొస్టాలు సెంటర్లో ఉన్నానని గురువారం భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమె సాయంత్రం 4 గంటలకు డయల్ 100కు ఫోన్ చేసి విషయం చెప్పింది. దీంతో మద్దిపాడు పోలీసులు ముమ్మరంగా గాలించారు. రాత్రి ఏడు గంటల సమయంలో బండి రోశయ్య మేదరమెట్ల బైపాస్ వద్ద ఉన్నట్లు గుర్తించారు. అక్కడ పురుగుల మందు తాగడానికి ప్రయత్నించినట్లు సమాచారం. కుటుంబ కలహాల కారణంగా భార్యను బెదిరించాలన్న ఉద్దేశంతోనే పురుగుమందు తాగుతున్నట్లు ఫోన్ చేశానని రోశయ్య పోలీసులకు వివరించాడు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
విధులకు డుమ్మా.. వైద్యుల తొలగింపు
ఒంగోలు టౌన్ : శాఖా పరంగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా, కనీసం సెలవు కూడా పెట్టకుండా విధులకు హాజరు కాకుండా తిరుగుతున్న వైద్యులపై రాష్ట్ర ప్రభుత్వం వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లోకాయుక్త ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 55 మందిని తొలగించారు. అందులో జిల్లాకు చెందిన ఆరుగురు వైద్యులు వున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment