
ఇదేంది సారూ.. రోజూ పప్పుచారు!
పెద్దదోర్నాల: విద్యార్థుల సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నట్టు చెబుతున్న నగదు ఎటు పోతోందో తెలియదు కానీ ఆ రెసిడెన్సియల్ పాఠశాల విద్యార్దినుల కష్టాలు మాత్రం గట్టెక్కడం లేదు. పాఠశాలలో హాస్టల్ నిర్వహణ, సిబ్బంది పనితీరుపై అధికారుల పర్యవేక్షణ, విద్యార్థినుల సంక్షేమంపై అధ్యాపకులు అనుసరిస్తున్న వైఖరి విమర్శలకు కేంద్ర బిందువయ్యాయి. కాగితాలకే పరిమితమైన ఆహార పట్టికతో పాటు, తాగేందుకు పరిశుభ్రమైన నీరు సైతం దొరకని పరిస్థితులు అక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తాయి. ఇలా ఎన్నో సమస్యలు ఆ మోడల్ పాఠశాలను పట్టి పీడిస్తున్నాయంటే సమస్యలను ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పిల్లలకు సరైన భోజనం పెట్టటం లేదంటూ కొందరు విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదుతో పాఠశాలను ‘సాక్షి’ విజిట్ చేయగా వసతి గృహంలోని డొల్లతనం బట్టబయలైంది. పెద్దదోర్నాల మండల పరిధిలోని మోట్ల మల్లికార్జునాపురంలోని ఏపీ మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ వసతి గృహ విద్యార్థినులు భోజనంతో పాటు వసతి సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యలపై ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించుకున్న నాథుడే కరువయ్యారంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రిన్సిపాల్‌ను ప్రశ్నిస్తే ‘నేను పదేళ్ల పాటు పలు పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేశా. ఎవరికి చెప్పినా ఏమీ చేయలేర’న్న ధోరణితో వ్యవహరించడం గమనార్హం. మోడల్ పాఠశాలలో సుమారు 529 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠశాల ప్రాంగణంలోనే ఉన్న బాలికల హాస్టల్‌లో 100 మంది వరకు ఉంటున్నారని సిబ్బంది చెపుతున్నారు. అయితే హాస్టల్ బాలికలు గత కొంత కాలంగా అన్నం, పప్పు చారుతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. బాలికలు ట్యాంకు నీటినే తాగుతున్నారు. దీనిపై పార్ట్‌టైం వార్డెన్‌ను ప్రశ్నించగా.. తనకు ఏమీ తెలియదని, ప్రిన్సిపాల్ ఏది చెబితే అదే వండుతున్నానని, మినరల్ వాటర్ ప్లాంట్ పనిచేయటం లేదని ఆమె సమాధానమిచ్చారు. ఇదిలా ఉండగా ఏ రోజు ఏమి వండాలో కూడా తెలియని పరిస్థితి వంట మనుషుది. వసతి గృహంలో ప్రభుత్వం నిర్దేశించిన మెనూ వివరాలే లేకపోవడం గమనార్హం. మెనూ ఏమిటో చెప్పాలని ప్రిన్సిపాల్‌ను కోరగా నీళ్లు నమలడం ఆయన వంతైంది. ఇతర పాఠశాలల ప్రిన్సిపాళ్లకు ఫోన్ చేసి మోనూ వివరాలు వాట్సాప్‌లో తెప్పించుకున్నారంటే ఇక్కడ ఏం జరుగుతోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విద్యార్థినుల సంఖ్య 100 అని ప్రిన్సిపాల్ చెబుతుండగా అంతమంది లేరని మిగిలిన సిబ్బంది పేర్కొంటున్నారు. ఒక్కో విద్యార్థినికి ప్రభుత్వం నెలకు రూ.1600 ఖర్చు చేస్తోంది. ఆ మేరకు కూరగాయలు, ఆకుకూరలు వండకుండా కేవలం అన్నం, నీళ్ల చారు మత్రమే పెడుతుండటం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తోంది. మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ సిబ్బందిపై చర్యలు తీసుకుని, మెనూ పాటించేలా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment