
గురుకులంలో దారుణం
టంగుటూరు: స్థానిక వెంకటాయపాలెం సమీపంలో ఉన్న మహాత్మా జ్యోతీబాపూలే గురుకుల బాలుర పాఠశాలలో గురువారం దారుణం చోటుచేసుకుంది. విద్యార్థులచే వంటశాలలో వెట్టి చాకిరీ చేయిస్తుండటంతో వేడివేడి పాలు ఐదో తరగతి విద్యార్థి మాచేపల్లి మధుమోహన్‌పై పడి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటనతో విద్యార్థులచే గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, హాస్టల్ వార్డెన్ వెట్టిచాకిరీ చేయిస్తున్న బాగోతం బయటపడింది. మర్రిపూడి మండలం కూచిపూడి గ్రామానికి చెందిన మాచేపల్లి మధుమోహన్ (11) గురుకుల బాలుర పాఠశాలలో చదువుతున్నాడు. పాఠశాల ప్రిన్సిపాల్, హాస్టల్ వార్డెన్లు వంటశాలలో విద్యార్థులతోనే కొన్నాళ్లుగా పనులు చేయిస్తున్నారు. గురువారం ఐదో తరగతి విద్యార్థి మాచేపల్లి మధుమోహన్ వంటశాలలో పనులు చేసి విద్యార్థులకు పాలిచ్చే సమయంలో వేడివేడి పాలు అతనిపై పడ్డాయి. వంటశాల నుంచి పాలను బయటకు తీసుకొచ్చే క్రమంలో బరువు మోయలేక పాత్ర కిందపడి వేడి పాలు మధుమోహన్‌పై పడటంతో తీవ్రగాయాలయ్యాయి. శరీరం అంతా కాలిపోయింది. పాఠశాల ప్రిన్సిపాల్, హాస్టల్ వార్డెన్‌లు గుట్టుచప్పుడు కాకుండా టంగుటూరులోని ఆరాధ్య ప్రైవేటు ఆస్పత్రికి వైద్యం నిమిత్తం తగిలించారు. దీంతో ఈ ఘటన బహిర్గతమైంది. జిల్లా ఉన్నతాధికారులు పాఠశాలకు వస్తారనే భయంతో ప్రిన్సిపాల్, హాస్టల్ వార్డెన్లు పాలు పడిన ప్రాంతాన్ని క్లీన్ చేశారు. విద్యార్థికి గాయాలైన విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు తెలుసుకుని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, హాస్టల్ వార్డెన్‌పై మండిపడ్డారు. విద్యార్థులతో పనులు చేయిస్తే ఊరుకోమని తేల్చి చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు రక్షణ లేకపోతే ఎలాగంటూ నిలదీశారు. ప్రిన్సిపాల్, హాస్టల్ వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, గాయాలపాలైన విద్యార్థిని మెరుగైన వైద్యం కోసం ఒంగోలు కిమ్స్‌కు తరలించారు. విద్యార్థిని మంత్రి డీబీవీ స్వామి గురువారం పరామర్శించారు. సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
నిర్లక్ష్యమే కారణం
ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇటువంటి ఘటన జరిగిందని బక్క తిరుమలరావు మాదిగ అన్నారు. వేడి పాలు మీద పడి గాయాలైన బాలుడికి నాణ్యమైన వైద్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులతో పనులు చేయించిన సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు.
వంటశాలలో విద్యార్థులతో పనులు
విద్యార్థి మధుమోహన్‌పై వేడివేడి పాలు పడి తీవ్రగాయాలు
మెరుగైన వైద్యం కోసం ఒంగోలు కిమ్స్‌కు తరలింపు
ప్రిన్సిపాల్, హాస్టల్ వార్డెన్‌పై విద్యార్థి తల్లిదండ్రుల ఆగ్రహం

గురుకులంలో దారుణం
Comments
Please login to add a commentAdd a comment