
పశ్చిమాన జోరుగా గంజాయి విక్రయం!
గిద్దలూరు(బేస్తవారిపేట): పశ్చిమ ప్రకాశంలో గంజాయి వ్యాపారం జోరుగా కొనసాగుతోంది. మార్కాపురం, కంభం, గిద్దలూరులో గంజాయి సరఫరా చేసే వ్యక్తులు, అమ్మకందారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నిఘా వైఫల్యం కారణంగానే గంజాయి విక్రయాలు గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్నట్లు తెలుస్తోంది. గత నెలలో గిద్దలూరులోని కొంగలవీడు రోడ్డులో గంజాయి విక్రేతలు నలుగురిని పోలీసులు అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. గిద్దలూరులోని పూసలబజార్ సమీపంలోని ఎస్టీ కాలనీలో ఈ ముఠా ఉన్నట్లు స్థానికుల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. విశాఖపట్నం నుంచి గిద్దలూరుకు గంజాయి ప్యాకెట్లు వస్తున్నాయని సమాచారం. రెండు రోజుల క్రితం పెద్ద ఎత్తున గంజాయి ప్యాకెట్లతోపాటు ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొందరు గిద్దలూరు పరిసర ప్రాంతాల్లో ఉంటూ గంజాయి దందా చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే గంజాయి రాకెట్ వచ్చే అవకాశం ఉంది. పోలీసులు గంజాయి సరఫరా, అమ్మకందారులపై కఠిన చర్యలు తీసుకోకపోతే పల్లెలకు విస్తరించే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment