
మిర్చి రైతు.. గడ్డు పరిస్థితి
జిల్లాలో మూడేళ్లుగా లాభాలు చవిచూసిన మిర్చి రైతు నేడు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. పంట చేతికొచ్చిన సమయంలో కనీస మద్దతు ధర రాక విలవిల్లాడుతున్నాడు. కూటమి ప్రభుత్వం నుంచి కనీస మద్దతు సైతం లభించకపోవడం, తెగుళ్లు ఆశించడం, కూలి రేటు భారీగా పెరగడంతో పాటు గుంటూరు మార్కెట్ యార్డులో ధరలు నేలచూపులు చూస్తుండడంతో మిర్చి రైతు కంట రక్త కన్నీరొస్తోంది. లక్షలు వెచ్చించి సాగుచేసిన రైతులు లబోదిబోమంటున్నా ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరువైంది. ఇదే అదునుగా సిండికేట్లు నాణ్యతలేవంటూ ధరలు తగ్గించేసి దోచేస్తున్నారు. జిల్లాలో దయనీయంగా మారిన మిర్చి రైతు పరిస్థితిపై సాక్షి ఫోకస్...
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలోని పశ్చిమ ప్రకాశంలో మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి తదితర నియోజకవర్గాల్లోని గ్రామాల్లో రైతులు అత్యధికంగా మిర్చి సాగుచేశారు. గతేడాది జిల్లాలో 66,387 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేయాల్సి ఉండగా, మార్కెట్లో ధరలు ఆశాజనకంగా ఉండటంతో 96 వేల ఎకరాల్లో సాగు చేశారు. లాభాలు చవిచూశారు. గతేడాది గుంటూరు మార్కెట్ యార్డులో తేజ రకం అత్యధికంగా రూ.22 వేల నుంచి రూ.24 వేల మధ్య విక్రయాలు సాగాయి. ఫలితంగా రైతులు లాభాలు ఆర్జించారు. వచ్చే ఏడాది కూడా మంచి ధరలు వస్తాయని రైతులు ఎదురు చూశారు. పరిస్థితి తలకిందులైంది. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం ఫలితంగా రైతులకు లాభాల సంగతి దేవుడెరుగు.. కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రైతులు సాగు విస్తీర్ణాన్ని భారీగా తగ్గించేసుకున్నారు. సుమారు 59,005 ఎరాల్లో సాగు చేశారు. ఇప్పటికే 3 కోతలు పూర్తయ్యాయి. నవంబర్‌లో క్వింటా ధర రూ.17 వేల నుంచి రూ.18 వేలు ఉండగా, డిసెంబరు నాటికి రూ.14 వేలకు పడిపోయింది. జనవరిలో రూ.14 వేల నుంచి రూ.12 వేలకు చేరి తాజాగా రూ.10 వేలు కనిష్టానికి పడిపోయింది. ఇక మిర్చి కోతలకు కూలీలకు భారీగా చెల్లించాల్సి వస్తోంది. క్వింటా మిర్చి కోసేందుకు రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకూ ఖర్చు చెల్లిస్తున్నామని రైతులు తెలిపారు. ఇలా అయితే మిర్చి సాగు చేపట్టడం కష్టమని రైతులు వాపోతున్నారు.
కొనుగోలు కేంద్రాలు నిల్...
పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో మిర్చిని అధిక విస్తీర్ణంలో సాగుచేశారు. అయితే ప్రభుత్వ పరంగా కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు పండించిన మిర్చిని బస్తాల్లో పెట్టుకుని గుంటూరు వెళ్తున్నారు. దీంతో రానూ.. పోనూ లారీ బాడుగ కింద సుమారు రూ.20 వేల ఖర్చు వస్తుంది. మార్క్‌ఫెడ్ ద్వారా మిర్చి కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నా ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందనా లేదు. ఎకరా మిర్చి సాగుకు సుమారు రూ.లక్ష నుంచి రూ.1.25 లక్షల వరకూ ఖర్చుపెట్టారు. ఎకరాకు 15 క్వింటాళ్ల వరకు దిగుబడులు రావచ్చని రైతులు భావిస్తున్నారు. గుంటూరు మార్కెట్ యార్డులో తేజ, బాడిగ రకాల మిర్చిని ఎక్కువగా రైతులు తీసుకెళ్తున్నారు. ఈ రెండు రకాల ధరలు తగ్గిపోయాయి. తేజ టాప్ క్వాలిటీకి సుమారు రూ.12 వేల నుంచి 13 వేల వరకు ధర ఉన్నట్లు తెలుస్తోంది.
నాడు...
2020 నుంచి 2024 వరకూ రైతులకు ఎర్రబంగారంగా మిర్చి పంట నిలిచింది. వైఎస్సార్ సీపీ హయాంలో ధరల స్థిరీకరణ నిధిని పెట్టింది. ఏ పంటకు గిట్టుబాట ధర లేకుంటే ఆ పంటకు ధర పెంచి వ్యవసాయాన్ని పండుగలా మార్చారు నాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి సకాలంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందించి తెగుళ్లు వస్తే శాస్త్రవేత్తలతో సమావేశాలు నిర్వహించి నివారణ చర్యలు చేపట్టారు. ఎప్పటికప్పుడు ధరల వివరాలను రైతులకు తెలిపారు. దీంతో సాగుచేసిన రైతుల పాలిట ఎర్రబంగారంగా మిర్చి పంట మారింది. గతేడాది వరకూ క్వింటా ధర రూ.22 వేల నుంచి రూ.24 వేల వరకూ పలికింది. తేజ, బాడిగ రకాలకు అదనంగా మరో రూ.2 వేలు వచ్చింది.
నేడు...
జిల్లాలో మిర్చి సాగుచేసిన రైతులు కళ్లనీళ్లు పెట్టుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం మిర్చిరైతుకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైంది. మిర్చి సాగు చేసిన రైతు కంట్లో కారం పడుతోంది. గిట్టుబాటు ధర లేక విలవిల్లాడిపోతున్నారు. గుంటూరు యార్డులోనే క్వింటా ధర రకాన్ని బట్టి రూ.10 వేల నుంచి రూ.12 వేల మధ్య కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు సాగుచేసిన మిర్చికి మంచి ధర వచ్చేంత వరకు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచుకుంటున్నారు. ఎకరా మిర్చి సాగుకు రూ.లక్ష నుంచి రూ.1.25 లక్షల వరకు రైతులు ఖర్చు పెట్టారు. అయితే అక్టోబర్, నవంబర్‌లో మిర్చికి వైరస్ తెగులు సోకడంతో ఊహించని విధంగా పంట దిగుబడి తగ్గిపోయింది. ఇదే సమయంలో నవంబర్‌లో క్వింటా రూ.18 వేలు ఉండగా డిసెంబరు నాటికి రూ.14 వేలకు తగ్గింది. నేడు రూ.10 వేలకు కూడా కొనడం కష్టమైంది. మిర్చి ఎందుకు సాగుచేశామా అని రైతులు దిగులుపడుతున్నారు. ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయలేదు. పశ్చిమ ప్రకాశంలో గుంటూరు యార్డుకు పోలేని రైతులు దళారులు చెప్పిన ధరకే విక్రయించాల్సి వస్తోందని వాపోతున్నారు. లేకుంటే ముగ్గురు నలుగురు రైతులు కలిసి సుమారు రూ.20 వేలకు బాడుగ పెట్టుకుని లారీల్లో వేసుకుని గుంటూరు వెళ్లి రెండుమూడు రోజులు యార్డులోనే తిండీతిప్పలు మానేసి వచ్చిన ధరకే విక్రయించి ఉసూరుమంటూ తిరిగి వస్తున్నారు.
దిగుబడి లేదు.. ధర లేదు
ఐదు ఎకరాల్లో మిర్చి సాగు చేశా. గత పదేళ్ల నుంచి ఎండు మిర్చి పండిస్తున్నా. ఇంత దారుణమైన పరిస్థితులు గతంలో ఎప్పుడూ లేవు. ఎర్ర నల్లి ఉధృతంగా రావడంతో దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. గత ఏడాది ఎకరాకు 20–25 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. నేడు 10–15 కింటాళ్లు కూడా రావడం లేదు. నల్లి నివారించేందుకు విపరీతంగా పురుగుమందులు వాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎకరాకు ఖర్చు రూ.2 లక్షలు వచ్చింది. రెండు రోజుల క్రితం యార్డులో అమ్మితే క్వింటా రూ.12 వేలు ధర పడింది. గతేడాది రూ.20 వేల నుంచి రూ.22 వేల ధరకు అమ్మాను. తాలు కాయలు గతంలో రూ.12 వేల నుంచి రూ.15 వేలు ఉంటే నేడు రూ.5 వేలు కూడా పడటంలేదు. తెగుళ్లతో ఇంకో కోత వచ్చే పరిస్థితి లేదు. ఐదు ఎకరాలకు రూ.10 లక్షలకు పైగా ఖర్చు పెట్టాను. రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల నష్టం వస్తుంది. అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడంలేదు. – కామిరెడ్డి వెంకట రంగారెడ్డి, వంగపాడు, బేస్తవారిపేట
ఎకరాకు రూ.లక్ష నష్టం
గత ఏడాది ఎకరా మిరప సాగు చేశా. 30 క్వింటాల దిగుబడి వచ్చింది. అన్ని ఖర్చులుపోగా రూ.3 లక్షల ఆదాయం మిగిలింది. ఈ ఏడాది రెండు ఎకరాల్లో పంట సాగు చేశా. మొదటి కోతగా 6 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇందులో 4 క్వింటాలు తాలు, 2 క్వింటాలు మంచి కాయలు వచ్చాయి. తాలు రూ.6500, మంచి కాయలకు రూ.12 వేల ధర పలికింది. రెండో కోతకు 6 క్వింటాళ్లకు మించి వచ్చే పరిస్థితి లేదు. క్వింటా ఎండు మిర్చి కోతకు రూ.5 వేలు కోత కూలీలు, రూ.1000 గ్రేడింగ్, రూ.1000 గోతాలు, యార్డ్‌కు ట్రాన్స్‌ఫోర్ట్ ఖర్చు వస్తుంది. వర్షాలు అధికం కావడంతో కాయపై మచ్చలు ఏర్పడి లోపల బూజు రావడంతో బరువు తగ్గడంతో పాటు తాలు కాయలుగా మారాయి. తెగుళ్ల బెడద ఎక్కువగా ఉంది. ఖర్చులు అధికమయ్యాయి. రెండు ఎకరాలకు రూ.2.50 లక్షల నష్టం వస్తుంది. – లాకా కొండయ్య, వంగపాడు, బేస్తవారిపేట మండలం
ఇలా అయితే నష్టమే
నేను ఈ ఏడాది 10 ఎకరాల్లో మిర్చి సాగు చేశా. పెట్టుబడి సుమారు రూ.18 లక్షల వరకు అయ్యింది. మిర్చి నారు, ఎరువులు, తెగుళ్లకు మందులు, అంతరసేద్యంలో కూలీలకే ఎక్కువ ఖర్చయింది. వైరస్ తెగులు సోకడంతో దిగుబడులు తగ్గాయి. గుంటూరు యార్డులో మిర్చి ధర తగ్గడంతో పెట్టుబడులు వచ్చే అవకాశం కనిపించడం లేదు. గత రెండేళ్లుగా మిర్చికి మంచి ధర ఉండటంతో ఈ ఏడాది సాగుచేశా. అయితే ధరలు.. దిగుబడులు.. చూస్తే నష్టాలే వస్తున్నాయి. ఈ ప్రభుత్వం రైతుల గురించి పట్టించుకోకపోవడం బాధగా ఉంది. – గుంటక సుబ్బారెడ్డి, మిర్చిరైతు, పాతపాడు, కొనకనమిట్ల మండలం
ధరలు చూస్తే నీరసం వస్తుంది
రెండు ఎకరాల్లో మిర్చి సాగు చేశా. కోత కొద్దామన్నా కూలి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదు. అసలు పంటలు కొనుగోలు చేసేందుకు దళారులు రావడం లేదు. గుంటూరు యార్డులో క్వింటా రూ.12,500 పలుకుతోంది. గత ఏడాది తాలు కాయలకే ఆ ధర పలికింది. మంచి మిర్చికి రూ.18 వేల నుంచి రూ.22 వేల వరకు ధర పలికింది. ఒక్కో కూలీకి రూ.500 లేదా కిలోకు కాయలు కోసినందుకు రూ.30 ఇవ్వాల్సి వస్తోంది. ఎకరా కోత ఖర్చులకే రూ.60 వేలు ఖర్చవుతోంది. ఎకరా సాగుకు రూ.1.20 లక్షలు పెట్టుబడి పెడితే రూ.లక్ష కూడా వచ్చే పరిస్థితి ప్రస్తుతం లేదు. పంటను చూస్తే నీరసం వస్తుంది. ఐదు నెలల పాటు నేను, నా భార్య ఎంతో కష్టపడి పండించిన పంటను వదులుకోలేక నష్టం వచ్చినా సరే కోత కోపించాల్సిందేనని కూలీల కోసం ఎదురుచూస్తున్నాం. – ఆముదం వెంకటరమణారెడ్డి, వై.కొత్తపల్లి, యర్రగొండపాలెం
Comments
Please login to add a commentAdd a comment