కూటమి సిద్ధం
మిత్ర ద్రోహానికి
వైద్యమిత్రల ఉద్యోగ భద్రతపై నీలినీడలు
కంభం:
కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్) పథకాన్ని భీమా పరిధిలోకి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఆప్కాస్ రద్దు దిశగా ఇప్పటికే అడుగులేసిన ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి కొత్త విధానంలో ఎన్టీఆర్ వైద్యసేవ నిర్వహణ కొనసాగుతుందని వార్తలు వస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న సుమారు 2,500 మందికి పైగా వైద్యమిత్రలు, దాని పరిధిలో పనిచేసే ఇతర ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగులు తమ మిత్రులని, అన్ని విధాలా అండగా ఉంటామని ఎన్నికల వేళ హామీ ఇచ్చిన కూటమి నేతలు.. గద్దెనెక్కిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
2008లో దివంగత మహానేత వైఎస్సార్ హయాంలో ప్రారంభమైన ఆరోగ్యశ్రీ పథకంలో నాడు స్థానికతను బట్టి ఉద్యోగులను ఎంపిక చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో ఆరోగ్యశ్రీ విభాగంలో పనిచేసే ఉద్యోగులను అప్కాస్ (ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్‌సోర్సింగ్ సర్వీస్) కిందకు చేర్చారు. వారికి సీఎఫ్‌ఎంఎస్ ఐడీ ద్వారా ప్రతి నెల విధిగా వేతనం ఇవ్వడంతోపాటు ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించారు. సీఎఫ్‌ఎంఎస్‌లో వేతనం తీసుకోవడం వల్ల వారిని ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా పరిగణించారు. ప్రభుత్వ పథకాలు లేనప్పటికీ భవిష్యత్తులో తమ ఉద్యోగాలకు భద్రత ఉంటుందన్న ఆశతో వారు ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత డాక్టర్ ఎన్‌టీఆర్ వైద్యసేవను భీమా పరిధిలోకి తీసుకెళ్లే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తుండటంతో వారంతా ఆందోళకు గురవుతున్నారు. తమను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంచుతారో లేక ఊడబీకుతారోనన్న అయోమయంలో ఉద్యోగులు ఉన్నారు.
జిల్లాలో పరిస్థితి ఇలా..
జిల్లాలో 123 వైద్యశాలల్లో 147 మంది వైద్యమిత్రలు పనిచేస్తున్నారు. వీరిలో 90 శాతం మంది సుమారు 17 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న వారు ఉన్నారు. ఎక్కువ మంది డిగ్రీతోపాటు పీజీలు చేసిన వారున్నారు. వైద్యమిత్రలతో పాటు జిల్లాలో టీమ్ లీడర్లు 8 మంది, డీఎం ఒకరు, ఆఫీస్ అసోసియేట్లు ఇద్దరు పనిచేస్తున్నారు. తమను బీమా సంస్థల పరిధిలోకి తీసుకొస్తే తమ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిపోతుందని వైద్య మిత్రలు, ఇతర సిబ్బంది వాపోతున్నారు.
17 ఏళ్లుగా సేవలందిస్తూ..
రోగులు వైద్యశాలలో చేరినప్పటి నుంచి తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకునే వరకు వైద్యమిత్రలు పర్యవేక్షిస్తుంటారు. వైద్యశాలలకు వచ్చిన పేద ప్రజలకు వారికి అవసరమైన సమాచారాన్ని అందిస్తూ వారికి సేవలందిస్తుంటారు. వీరితోపాటు ఉద్యోగుల హెల్త్‌కార్డులు, జర్నలిస్ట్ హెల్త్‌కార్డు, ఆరోగ్య రక్ష స్కీమ్‌కు సంబంధించి సేవలందిస్తుంటారు. ఇలా అన్ని విభాగాల్లో దాదాపు 17 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల వయసు కూడా చాలా మందికి 50 సంవత్సారాలు దాటింది. ఆరోగ్యశ్రీ ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తే ఎవరిని ఉంచుతారో, ఎవరిని తొలగిస్తారోనని ఆందోళనగా ఉందని, ఈ వయసులో వేరే ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 17 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న వైద్యమిత్రలను కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రతను కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగాల్లో నోటిఫికేషన్ ఇచ్చిన సమయంలో వెయిటేజీ ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వైద్యమిత్రలు కోరుతున్నారు.
ఆరోగ్యశ్రీని భీమా కంపెనీలకు అప్పగించేందుకు యోచనలో కూటమి ప్రభుత్వం
ప్రస్తుతం సీఎఫ్‌ఎంఎస్ ఐడీ ద్వారా వేతనం పొందుతున్న వైద్యమిత్రలు
ప్రైవేట్‌వారికి అప్పగిస్తే తమ ఉద్యోగాలకు భద్రత ఉండదని ఆందోళన
కాంట్రాక్ట్ ఉద్యోగులుగా తమను గుర్తించాలని డిమాండ్
జిల్లాలో 123 వైద్యశాలల్లో 147 మంది వైద్యమిత్రలు
జిల్లాలో ఆరోగ్యశ్రీ ముఖ చిత్రం
కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించాలి
డిగ్రీలు, పీజీలు చదువుకొని పదిహేడేళ్లుగా వైద్యమిత్రలుగా పనిచేస్తున్నాం. ఆప్కాస్ రద్దు చేసే పక్షంలో తమను ట్రస్టు పరిధిలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించి భద్రత కల్పించాలి. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు అర్హులుగా గుర్తించాలి. ఎక్కడ విధులు నిర్వహించే వారిని అక్కడే బదిలీ చేయకుండా కొనసాగించాలి.
– బి.శేఖర్, ఏపీ ఎన్‌టీఆర్ వైద్యసేవ స్టేట్ సెక్రటరీ
కూటమి సిద్ధం
కూటమి సిద్ధం
Comments
Please login to add a commentAdd a comment