నత్తనడకన బాల ఆధార్
బేస్తవారిపేట: జిల్లాలో బాల ఆధార్ నమోదు నత్తనడకన సాగుతోంది. 0–6 సంవత్సరాల లోపు చిన్నారులందరికీ ఆధార్ నమోదు చేయించాలని ప్రభుత్వం ప్రకటనలిస్తున్నా ప్రత్యేక క్యాంపుల నిర్వహణ లోపభూయిష్టంగా సాగుతోంది. దీంతో క్షేత్ర స్థాయిలో ఆశించిన స్థాయిలో ఫలితం కనపడటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ఆధార్ నమోదు చేయించేందుకు సంబంధిత అంగన్‌వాడీ కార్యకర్తలు శ్రద్ధ చూపించి చిన్నారులకు తమ సమీపంలోని గ్రామ/వార్డు సచివాలయాలు, ఆధార్ కేంద్రాలకు తీసుకువెళ్లి వివరాలు నమోదు చేయించాల్సి ఉంది. అయితే గ్రామ స్థాయిలో సిబ్బంది, అధికారులు సరైన అవగాహన కల్పించకపోవడంతో నమోదు ప్రక్రియలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో కూడా చిన్నారులకు ఆధార్ నమోదు చేస్తున్నారనే విషయం చాలా మందికి తెలియకపోవడం శోచనీయం. అలాగే గ్రామ/వార్డు సచివాలయాలకు కూడా అరకొరగానే ఆధార్ కిట్లను సరఫరా చేశారు. కొన్ని సచివాలయాల్లో ఆధార్ నమోదు కిట్లు పనిచేయకపోవడం, లాగిన్ సమస్యలతో ఆధార్ నమోదు ప్రక్రియ నిలిచిపోయింది.
జిల్లాలోని 13 ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌ల పరిధిలో 40 మండలాల్లో 2,903 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 0–6 సంవత్సరాలలోపు పిల్లలు 1,25,274 నమోదై ఉన్నారు. 96,650 మందికి ఆధార్ ఉంది. ఆధార్ లేని పిల్లలు 26,593 మంది కాగా బర్త్ సర్టిఫికెట్ ఉన్న పిల్లలు 10,093 మంది ఆధార్ పొందలేదు. మరో 15,631 మందికి ఇప్పటి వరకు బర్త్ సర్టిఫికెట్ తీసుకోలేదు. జిల్లాలో 0–6 ఏళ్లలోపు చిన్నారుల్లో 53.1 శాతం మందికి ఆధార్ ఉండగా.. ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసిన తర్వాత ఈ రెండు నెలల వ్యవధిలో 11 శాతం మంది చిన్నారులకు ఆధార్ నమోదు చేశారు.
జిల్లాలో 0–6 ఏళ్లలోపు చిన్నారులు 1,25,274 మంది
ప్రత్యేక క్యాంపుల్లో 11 శాతం పిల్లలకే ఆధార్ నమోదు
జనన ధ్రువీకరణ పత్రాలు తీసుకోక, సరైన అవగాహన లేక మందకొడిగా సాగుతున్న ప్రక్రియ
Comments
Please login to add a commentAdd a comment