చిరుద్యోగులపై దాడులు
కూటమి పాలనలో
ఒంగోలు టౌన్: రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత చిరుద్యోగులపై దాడులు పెరిగిపోయాయని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు చీకటి శ్రీనివాసరావు విమర్శించారు. శుక్రవారం సీఐటీయూ జిల్లా కార్యాలయంలో మున్సిపల్ యూనియన్ నగర కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది నెలల్లోనే వందలాది మంది చిరుద్యోగుల పొట్టకొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల కోట్ల రూపాయలను బడా కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్న పాలకులు.. రోడ్లు చిమ్ముకునే పారిశుధ్య కార్మికులను వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. మేసీ్త్రల మీద వైఎస్సార్ సీపీ ముద్ర వేసి 106 మందిని విధుల నుంచి తొలగించారని, వారిని విధుల్లో తీసుకోవాలని కోరుతూ 50 రోజులుగా పోరాటం చేస్తున్నప్పటికీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మేసీ్త్రల కుటుంబాలను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆప్కాస్‌ను రద్దు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో కార్మికులు భయాందోళనకు గురవుతున్నారని చెప్పారు. యూనియన్ గౌరవ అధ్యక్షుడు టి.మహేష్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చెత్త సేకరణకు నియమించిన 60 మంది క్లాప్ డ్రైవర్లను, ఆటోలను సోమవారం నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించడాన్ని తప్పుబట్టారు. ఈ నిర్ణయంతో క్లాప్ డ్రైవర్ల కుటుంబాలు పస్తులుండాల్సి వస్తుందన్నారు. ఆప్కాస్‌ను రద్దు చేసి కార్మికులను తొలగిస్తే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో విజయమ్మ, కొర్నెపాటి శ్రీనివాసరావు, సామ్రాజ్యం, దివ్య, సంతోషమ్మ, తిరుపతమ్మ, రవి, వెంకయ్య, బాబు, సాయి, మధు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment