
రచ్చ చేస్తే రంగుపడుద్ది
● హోలీ ప్రశాంతంగా చేసుకోవాలి● ఎస్పీ దామోదర్ హెచ్చరిక
ఒంగోలు టౌన్: ఎవరినీ రెచ్చగొట్టకుండా సంతోషకర వాతావరణంలో హోలీ పండుగను చేసుకోవాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ గురువారం ఒక ప్రకటనలో సూచించారు. జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఆయన శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పండుగ చేసుకోవాలన్నారు. ఇతరుల మనోభావాలను దెబ్బతినేలా వ్యవహరించవద్దని, మహిళల పట్ల మర్యాదగా ప్రవర్తించాలన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో సమస్యలను సృష్టిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ప్రార్థనా మందిరాల వద్ద రంగులు చల్లవద్దన్నారు. జిల్లాలోని ముఖ్యమైన పట్టణాలు, ప్రదేశాలు, కాలనీలు, రహదారులపై సీసీ కెమెరాలతో పాటుగా డ్రోన్ కెమెరాల నిఘా ఉంటుందని తెలిపారు. మద్యం మత్తులో వాహనాలను నడపరాదని, వాహనాలను తనిఖీ చేయనున్నట్లు వివరించారు. ద్విచక్ర వాహనాల సైలెన్సర్లు తీసేసి పెద్ద శబ్ధాలు చేయడం, చుట్టుపక్కల వారిని ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. ఎవరైనా గొడవలు పడినా, అసత్య ప్రచారాలు చేసినా, ఇతరుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, మహిళలను వేధింపులకు గురిచేసినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తలిదండ్రులు పిల్లల పట్ల జాగ్రతగా ఉండాలని సూచించారు.
గోశాలకు మంటలు
● రూ.50 వేలు ఆస్తి నష్టం
మార్కాపురం: పట్టణ శివారులోని బీడుభూమిలో గురువారం చెలరేగిన మంటలు పక్కనే ఉన్న గోశాలకు వ్యాపించడంతో సుమారు రూ.50 వేల ఆస్తి నష్టం సంభవించింది. ఫైర్ ఆఫీసర్ రామకృష్ణ కథనం ప్రకారం.. తర్లుపాడు రోడ్డులోని బీడు భూముల్లో గుర్తుతెలియని వ్యక్తి సిగరెట్ తాగి ముళ్లపొదల్లో పడేశాడు. వేసవి కాలం కావడంతో మంటలు చెలరేగి చుట్టుపక్కల ఉన్న పొదలకు వ్యాపించాయి. బీడు భూమి సమీపంలోనే ఉన్న గోశాలకు కూడా నిప్పు అంటుకుంది. ఆ సమయంలో గోవులు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. గోశాలలోని పశుగ్రాసం, ఇతర సామగ్రి కాలిపోయాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వెళ్లి మంటలు అదుపు చేశారు.
రుణాల రికవరీ
వేగవంతం చేయాలి
ఒంగోలు వన్‌టౌన్: రుణాల రికవరీని వేగవంతం చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరక్టర్ టి.నారాయణ సిబ్బందిని ఆదేశించారు. ఒంగోలు భాగ్యనగర్‌లోని టీటీడీ సెంటర్‌లో జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు, ఏరియా కో ఆర్డినేటర్లు, కమ్యూనిటీ కో ఆర్డినేటర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ రుణాల రికవరీ వేగంగా చేస్తేనే నూతన రుణాలు మంజూరుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రతి 15 రోజులకు ఒక సారి రుణాల రివకరీపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. సీ్త్రనిధి, ఉన్నతి, కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్, జీవనోపాధులు తదితర రుణాల రికవరీని వేగంగా చేయాలన్నారు. నూతన రుణాల మంజూరులో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యం కల్పించాలన్నారు. డీపీఎంలు, ఏపీఎంలు పాల్గొన్నారు.
700 బస్తాల రేషన్
బియ్యం పట్టివేత
నాగులుప్పలపాడు: రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని గురువారం ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులు పట్టుకున్నారు. చీరాల నుంచి ఒంగోలు వైపు రేషన్ బియ్యం తరలిస్తున్నారన్న సమాచారంతో ఎన్‌ఫోర్సుమెంట్ డీటీ రాజ్యలక్ష్మి సిబ్బందితో దాడులు చేశారు. చదలవాడ నుంచి త్రోవగుంట వరకు లారీని వెంబడించి తనిఖీలు చేశారు. తనిఖీల్లో 700 బస్తాల రేషన్ బియ్యం గుర్తించి వాటిని సీజ్ చేసి ఎంఎల్‌ఎస్ గోడౌన్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
మోటార్ సైకిల్‌లో పాము
దర్శి(ముండ్లమూరు): స్థానిక రెవెన్యూ కార్యాలయం వద్ద పార్కింగ్ చేసిన ద్విచక్రవాహనంలోకి ఐదు అడుగుల పాము దూరింది. మోటారు సైకిల్‌లో శబ్ధం రావడంతో పామును గుర్తించిన మోటారు సైకిల్ యజమాని స్థానికుల సాయంతో పామును బయటకు తీసేందుకు ప్రయత్నించారు. అయితే ఎంత సేపటికీ పాము మాత్రం బయటకు రాలేదు. కర్ర సాయంతో చివరకు అతి కష్టం మీద బయటకు తీయగా ఆ పాము జర్రిపోతని స్థానికులు తెలిపారు. దీంతో వాహన యజమాని ఊపిరి పీల్చుకున్నారు.

రచ్చ చేస్తే రంగుపడుద్ది

రచ్చ చేస్తే రంగుపడుద్ది
Comments
Please login to add a commentAdd a comment