
భక్తిరస రమ్యం
నయనానందం..
కొనకనమిట్ల: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వెలుగొండ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మీ అలివేలు మంగ సమేత వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం శనివారం తెల్లవారు జామున వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలు, కిక్కిరిసిన భక్తజన సందోహం నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి ఈదుల చెన్నకేశవరెడ్డి, ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కుందురు కాశిరెడ్డిల పర్యవేక్షణలో ఉభయదాతలు శ్రీవారికి పసిడి, రజిత ఆభరణాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. వేద పండితులు భార్గవాచార్యులు, ప్రసాదాచార్యులు, పవన్‌కుమార్‌శర్మ, తిరుమలాచార్యులు కల్యాణ ఘట్టాన్ని జరిపించారు. కల్యాణ వ్యాఖ్యాతగా తాల్లూరి దుర్గా వెంకటేశ్వరరావు వ్యవహరించారు. కల్యాణాన్ని తిలకించేందుకు పరిసర గ్రామాల ప్రజలతో పాటు ఒంగోలు, మార్కాపురం, విజయవాడ, తెనాలి, చీరాల, వినుకొండ, నంద్యాల, హైదరాబాద్ ప్రాంతాల నుంచి భక్తులు కల్యాణంలో పాల్గొన్నారు. కల్యాణ ఉభయదాతలుగా వాగిచెర్ల, జూటూరి, మూర్తి, తాడి కుటుంబ సభ్యులు, ఆలయ ఈఓ చెన్నకేశవరెడ్డి, కమిటీ సభ్యులు కుందురు కాశిరెడ్డి దంపతులు వ్యవహరించి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
శ్రీవారికి ముత్యాల తలంబ్రాలు:
భక్తులు సమర్పించిన ముత్యాలతో స్వామివార్లకు వేదపండితులు, ఉభయదాతలు స్వామివారికి ముత్యాలతో తలంబ్రాలు పోశారు. తొలుత తాడివారిపల్లికి చెందిన తాడివారు కత్తులు కటార్లతో ఆచారం ప్రకారం గుర్రాల మీద ఉత్సవంగా ఆలయం వద్దకు వచ్చారు. కల్యాణానికి ముందు స్వామి వార్లకు రాయబార మండపం వద్ద నిశ్చితార్ధ రాయబార ఘట్టం నిర్వహించారు. రాయబార ఘట్టాలు ఛలోక్తిగా జరిగాయి. కల్యాణం అనంతరం మహిళలకు ముత్యాల తలంబ్రాలను, తీర్థ ప్రసాదాలు, లాటరీ ద్వారా 10 మంది మహిళా భక్తులకు చీరలు అందజేశారు. ఉదయం అల్పాహారాన్ని బ్రాహ్మణ అన్నదాన సత్రం కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు.
వైభవంగా వెలుగొండ వెంకటేశ్వరస్వామి కల్యాణం

భక్తిరస రమ్యం
Comments
Please login to add a commentAdd a comment