
జిల్లాలో వైఎస్సార్ సీపీని నాశనం చేసిన ఘనత బాలినేనిది
● పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ మాదాసి వెంకయ్య
ఒంగోలు టౌన్: జిల్లాలో ప్రతి నియోజకవర్గంలోనూ నాయకుల మధ్య చిచ్చుపెట్టి గ్రూపులు కట్టించి వైఎస్సార్ సీపీ ఓటమి చెందడానికి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రధాన కారణమని పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ మాదాసి వెంకయ్య విమర్శించారు. స్థానిక వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాయకులు, కార్యకర్తలు వైఎస్ జగనన్నను కలవకుండా అడ్డుకున్నారన్నారు. బాలినేని పార్టీకి దూరమైన తర్వాత ఈ 9 నెలల కాలంలో తాను పదిసార్లు జగనన్నను కలిసి మాట్లాడానని చెప్పారు. వైఎస్సార్ సీపీలో బాలినేనికి ఎంతో ప్రాధాన్యత, గౌరవం ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు జనసేనలో 250 మందిలో ఎక్కడో వెనక కూర్చోవాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. ఎమ్మెల్సీ తీసుకుని మంత్రి అయ్యాకనే ఒంగోలు వస్తానని బాలినేని చెబుతున్నాడని, ఈ లెక్కన ఆయన ఎప్పటికీ ఒంగోలు రాలేడని వ్యాఖ్యానించారు. విలేకరుల సమావేశంలో కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, వైఎస్సార్ సీపీ ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకర్‌రావు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, లీగల్‌సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు భూమిరెడ్డి రవణమ్మ, మహిళా నాయకురాలు షేక్ అఫ్సర్, నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్‌ఖాన్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మలిశెట్టి దేవ, మైనార్టీ నాయకులు షేక్ మీరావలి, షేక్ నాగూర్, తాతా నరసింహగౌడ్, బత్తుల ప్రమీల, వెన్నపూస వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
21 నుంచి జాతీయ స్థాయి ఎడ్ల పోటీలు
కొనకనమిట్ల: ప్రసిద్ద పుణ్యక్షేత్రం వెలుగొండలో శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరునాళ్ల సందర్భంగా ఈ నెల 21, 22, 23 తేదీల్లో మూడు రోజుల పాటు జాతీయ స్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించనున్నట్లు దేవస్థాన ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కుందురు కాశిరెడ్డి, సభ్యులు జవ్వాజి బాషాపతినాయుడు, మేకలవారిపల్లి రెడ్ల సంఘ సభ్యులు తెలిపారు. 21వ తేదీ ఆరు పండ్ల సైజు విభాగంలో ఎడ్ల బండలాగుడు పోటీలు ప్రారంభమవుతాయన్నారు. 22, 23 తేదీల్లో న్యూ కేటగిరి, సీనియర్ విభాగాలలో పోటీలు ఉంటాయన్నారు. ఆరు పళ్ల సైజు విభాగంలో గెలుపొందిన ఎడ్లకు మొదటి ఆరు బహుమతులుగా వరుసగా రూ.60 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలు, రూ.8 వేలు అందజేస్తామన్నారు. న్యూ కేటగిరీలో గెలుపొందిన ఎడ్లకు మొదటి ఆరు బహుమతులుగా రూ.70 వేలు, రూ.50 వేలు, రూ.35 వేలు, రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలు అందజేస్తామన్నారు. సీనియర్ విభాగంలో గెలుపొందిన ఎడ్లకు మొదటి ఆరు బహుమతులుగా వరుసగా రూ.80 వేలు, రూ.60 వేలు, రూ.40 వేలు, రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలను దాతల సహకారంతో అందజేస్తామన్నారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఎడ్ల జతకు రూ.5 వేల చొప్పున కాసు చారిటబుల్ ట్రస్టు తరఫున నగదు బహుమతి ఇవ్వనున్నట్లు వెల్లడించారు. పోటీల్లో పాల్గొనే ఎడ్ల యజమానులు ఎంట్రీ ఫీజు చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 8008716521, 9505345703, 9963429928, 9581137317 సెల్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.
400 ఏళ్లనాటి చింతచెట్టుకు నిప్పు
రాచర్ల: శతాబ్దాల నాటి చింతచెట్టుకు నిప్పు పెట్టడంతో పూర్తిగా కాలిపోయి కూలిపోయింది. రాచర్ల మండలంలోని అనుమలవీడు గ్రామంలో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే.. అనుమలవీడు గ్రామానికి చెందిన షేక్ పల్నాటి గౌస్ అహమ్మద్ నల్లరేగడి పొలంలో ఉన్న 400 సంవత్సరాల కాలంనాటి చింతచెట్టుకు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. దీంతో ఆ చెట్టు పూర్తిగా కాలిపోయి కూలిపోయింది. 50 ఎకరాల గల నల్లరేగడి పొలాల రైతులు వచ్చి ఈ చెట్టుకింద కూర్చుని కొంత సమయం సేదతీరేవారు. ప్రస్తుతం వేసవి ప్రారంభమై ఎండలు పెరుగుతున్న సమయంలో చెట్టుకు నిప్పుపెట్టి కూల్చడంపై రైతులు, పశుపోషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో వైఎస్సార్ సీపీని నాశనం చేసిన ఘనత బాలినేనిది
Comments
Please login to add a commentAdd a comment