పరీక్ష కేంద్రాలను పరిశీలించిన ఆర్‌జేడీ
గిద్దలూరు రూరల్: పట్టణంలోని పదో తరగతి పరీక్ష కేంద్రాలను గుంటూరు ఆర్‌జేడీ లింగేశ్వరరెడ్డి ఆదివారం పరిశీలించారు. పట్టణంలోని సెయింట్‌పాల్స్ బీఈడీ కళాశాల ఏ, బీ సెంటర్లు, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, పీవీఆర్ బిఈడీ కళాశాల, సూర్య స్కూల్, ఆర్.ఆర్ స్కూల్, ఎస్వీ జూనియర్ కళాశాల, ముండ్లపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 1164 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. విద్యార్ధులకు కల్పించే వసతుల్లో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని ఆర్‌జేడీ అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాల్లో మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఎంఈఓ కావడి వెంకటేశ్వర్లు, పరీక్షా సెంటర్ల డీఓలు తదితరులు ఉన్నారు.
పూరిగుడిసె దగ్ధం
గిద్దలూరు రూరల్: గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించడంతో పూరిగుడిసె దగ్ధమైంది. ఈ సంఘటన మండలంలోని ఓబులాపురంలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. బాధితురాలు దుగ్గెపోగు రాములమ్మ తన కుమార్తె ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో ఇంట్లో ఉన్న రాములమ్మ ఆమె కుమార్తె ప్రాణభయంలో ఇంటి నుంచి బయటకు వచ్చారు. దీంతో స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఇంట్లోని టీవీ, మంచాలు, వంట సామాన్లు, ఇతర వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాదంతో కట్టుబట్టలతో రోడ్డుపై నిలబడే పరిస్థితి ఏర్పడిందని రాములమ్మ వాపోయింది. 6 నెలల క్రితం రాములమ్మకు చెందిన గడ్డివామును సైతం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో కాలిబూడిదైంది. ఎంపీపీ కడప లక్ష్మీ, మాజీ ఎంపీపీ కడప వంశీధరరెడ్డిలు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలికి రూ.12,500 ఆర్థికసాయం చేశారు. గ్రామ సర్పంచ్ బి.భూదేవి, ఉప సర్పంచ్ పల్లా భారతి, వైఎస్సార్ సీపీ నాయకులు బొర్రాక్రిష్ణారెడ్డి, సుబ్బారెడ్డి వంట సామాన్లు, ఇతర వస్తువులు సమకూర్చారు.
కూతురు ప్రేమ వివాహం చేసుకుందని..
● పురుగుమందు తాగి తల్లి ఆత్మహత్య
జరుగుమల్లి(సింగరాయకొండ): కుమార్తె ప్రేమ వివాహం చేసుకుందన్న ఆగ్రహంతో మనస్తాపం చెంది పురుగుమందు తాగి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన జరుగుమల్లి మండలం కె.బిట్రగుంటలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం...కొత్తపట్నం మండలం పాదర్తి గ్రామానికి చెందిన మూగ అలివేలమ్మ(44) కూతురితో కలిసి జనవరిలో సంక్రాంతి పండుగ నిమిత్తం అమ్మగారిల్లు కె.బిట్రగుంట వచ్చింది. ఆ సమయంలో కూతురు కోమలి ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపానికి గురైన అలివేలమ్మ తల్లి వద్దే ఉంటుంది. ఈ క్రమంలో ఆదివారం పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి.మహేంద్ర తెలిపారు.
పరీక్ష కేంద్రాలను పరిశీలించిన ఆర్‌జేడీ
Comments
Please login to add a commentAdd a comment