మోసం చేయడం చంద్రబాబు నైజం
పుల్లలచెరువు: ఎన్నికలకు ముందు ఇష్టం వచ్చినట్లు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. మండలంలోని రాచకొండలో శనివారం రాత్రి జరిగిన బంగారమ్మ తిరునాళ్లలో ఎమ్మెల్యే చంద్రశేఖర్ పాల్గొన్నారు. ముందుగా బంగారమ్మ తల్లిని దర్శించుకొని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలపై నుంచి ప్రజలను ఉద్దేశించి చంద్రశేఖర్ మాట్లాడారు. ఎన్నికలకు ముందు సూపర్‌సిక్స్ పేరుతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి 9 నెలలు దాటినా ఒక్క పథకం కూడా అమలు చేసిన పాపాన పోలేదని విమర్శించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా పాలన సాగించారన్నారు. పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదేనన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన తప్ప ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. డీఎస్సీపై ఎన్నో ఆశలు పెట్టుకొని కోచింగ్‌లు తీసుకుంటున్న నిరుద్యోగుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. నియోజకవర్గంలో కూటమి నేతలు చేస్తున్న అక్రమాలు అన్ని ఇన్నీ కావన్నారు. నియోజకవర్గంలో ప్రతి వీధిలో బెల్టుషాపు దర్జాగా నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఇసుక దందాపై కూటమి నాయకులే ఇబ్బందులు పడుతూ ప్రభుత్వాన్ని ఛీ కొడుతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రజలు మంచి పాలన చేయమని అధికారం ఇస్తే..కేవలం వైఎస్సార్ సీపీ నాయకులను ఇబ్బందులకు గురిచేయడమే తప్ప ప్రజా సంక్షేమాన్ని కూటమి నాయకులు మర్చిపోయారన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజల సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. అనంతరం గ్రామస్తులు ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుముల శ్రీనివాసరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు ఓబుల్‌రెడ్డి, త్రిపురాంతకం దేవస్థానం కమిటీ చైర్మన్ సుబ్బారావు, సర్పంచ్‌లు టి.సత్యనారాయణరెడ్డి, ఎ. కోటిరెడ్డి, ఏ రమణారెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ రఘు, జిల్లా కార్యాచరణ కార్యదర్శి డి.వెంకటేశ్వర్లు, వలంటీర్ విభాగం అధ్యక్షుడు ఎం వాసు, సీనియర్ నాయకులు బి.సుబ్బారెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి, గడ్డం సుబ్బయ్య, గాలిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చిన హామీలను ఏనాడూ అమలు చేయలేదు
మాయమాటలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం
బంగారమ్మ తిరునాళ్లలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
Comments
Please login to add a commentAdd a comment