అర్ధరాత్రి..ఆకస్మిక తనిఖీ | - | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి..ఆకస్మిక తనిఖీ

Published Mon, Mar 17 2025 10:53 AM | Last Updated on Mon, Mar 17 2025 10:46 AM

అర్ధర

అర్ధరాత్రి..ఆకస్మిక తనిఖీ

ఒంగోలు టౌన్‌:

జిల్లా కేంద్రమైన ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి క్యాజువాలిటీ వద్దకు శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఒక కారు వచ్చి ఆగింది. అందులోంచి ఒక మహిళ దిగి క్యాజువాలిటీలోకి వెళ్లారు. ముఖానికి మాస్క్‌ కట్టుకొని ఉండడంతో వైద్య సిబ్బంది ఆమెను గుర్తించలేకపోయారు. చికిత్స కోసం వచ్చి ఉంటారులే అని నిర్లక్ష్యంగా ఎవరి మాటల్లో వారు పడిపోయారు. హెడ్‌ నర్సు మాంచి నిద్రలో గుర్రు పెడుతున్నారు. కొంత మంది మెడికోలు మాత్రం పనిచేస్తూ కనిపించారు. వారు సదరు మహిళను ఏం కావాలని అడిగారు. ఇక్కడ పనిచేసే వైద్యులు ఎక్కడకు పోయారని ప్రశ్నించడంతో సిబ్బందిలో అనుమానం వచ్చింది. తీరా చూస్తే ఆమె ఎవరో కాదు. సాక్షాత్తు కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా. శుక్రవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘ఓపిక నశిస్తూ... పీజీలే దిక్కనిపిస్తూ’ శీర్షికతో ప్రచురించిన కథనాన్ని సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా శనివారం రాత్రి జీజీహెచ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

కలెక్టర్‌ తనిఖీకి వచ్చారని తెలుసుకుని క్యాజువాలిటీ సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. డ్యూటీ వైద్యులకు వెంటనే సమాచారం ఇచ్చారు. కానీ అప్పటికే కలెక్టర్‌ రికార్డులను పరిశీలించారు. డ్యూటీలో ఉండాల్సిన వైద్యులకు బదులుగా హౌస్‌ సర్జన్లు విధులు నిర్వహించడాన్ని గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులకు అవసరమైన అత్యవసర సేవలను అందించాల్సిన వైద్యులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటని మండిపడ్డారు. అక్కడ చికిత్సకు వచ్చిన రోగులతో మాట్లాడి చికిత్స ఎలా చేస్తున్నారు. వైద్యులు అందుబాటులో ఉంటున్నారా.. సకాలంలో స్పందిస్తున్నారా.. అని వాకబు చేశారు. వైద్యుల పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడ నుంచి గైనకాలజీ విభాగానికి వెళ్లారు. అక్కడ ఒక వైద్యురాలు మాత్రం ఉన్నట్లు సమాచారం. అక్కడ నుంచి ఎన్‌ఎన్‌సీయూలోకి వెళ్లి చూడగా అక్కడ కూడా కనీసం ఒక్కటంటే ఒక్క వైద్యుడు కూడా లేకపోవడంతో కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నపిల్లలకు ఏదైనా అత్యవసర సమస్య వస్తే ఎలా అని ప్రశ్నించారు. ఆ తరువాత రేడియాలజీ విభాగానికి వెళ్లారు. నిజానికి రేడియాలజిస్టు అందుబాటులో ఉండడం లేదని విమర్శలు వస్తున్నాయి. అయితే కలెక్టర్‌ తనిఖీ చేసే సమయానికి మాత్రం రేడియాలజిస్టు విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్స్‌రే, సీటీ స్కానింగులు, ఎమ్మారై స్కానింగుల కోసం వచ్చిన వారికి ఎప్పుడు స్కానింగ్‌ చేస్తున్నారు, రిపోర్టులు ఎప్పుడు ఇస్తున్నారంటూ రేడియాలజిస్టును ప్రశ్నించారు. రికార్డులను పరిశీలించారు. వైద్య చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి ఎక్కువగా పేదలు వస్తుంటారని , స్కానింగ్‌ చేయడంలో రోగులను ఇబ్బంది పెడితే సహించేది లేదని హెచ్చరించారు. రాత్రి 11 గంటల సమయంలో ఆస్పత్రికి వచ్చిన ఆమె 12 గంటల వరకు అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో వైద్యులు సరిగా ఉండడం లేదని, అత్యవసర చికిత్సల విషయంలో కూడా ఆలస్యంగా స్పందిస్తున్నారని పలువురు రోగులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. నర్సింగ్‌ సిబ్బంది రోగులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఒకరు చెప్పారు. పారిశుధ్యం బాగాలేదని, జనరల్‌ వార్డుల్లో దుర్వాసన వేస్తుండడంతో రోగులు ఉండలేకపోతున్నారని ఆమె దృష్టికి తీసుకొచ్చారు. దీంతో అధికారులతో మాట్లాడిన కలెక్టర్‌ ఆస్పత్రి పనితీరు మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులు, నర్సింగ్‌ స్టాఫ్‌ ల మీద తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్‌ పర్యటన తరువాత ఐదుగురు నర్సింగ్‌ స్టాఫ్‌కు మెమో జారీ చేశారు. అయితే విధులు నిర్వహించకుండా పీజీలు, హౌస్‌ సర్జన్లతో మొబైల్‌ ఫోన్ల ద్వారా చికిత్స అందిస్తున్న వైద్యులను వదిలి కేవలం నర్సింగ్‌ స్టాఫ్‌ కు మాత్రమే మెమోలు ఇవ్వడమేంటని పలువురు నర్సులు ప్రశ్నిస్తున్నారు.

మెడికల్‌ ఐసీయూలో పనిచేయని ఏసీలు...

ఇదిలా ఉండగా కలెక్టర్‌ ఆకస్మికంగా పర్యటించిన తరువాత కూడా జీజీహెచ్‌ అధికారుల తీరు మారలేదన్న విమర్శలు వినవస్తున్నాయి. ఆస్పత్రిలోని ఐసీయూ కాంప్లెక్స్‌లోని మెడికల్‌ కాంప్లెక్స్‌లో మొత్తం 35 పడకలు ఉండగా 12 ఏసీలు ఉన్నాయి. కనీసం ఒక్క ఏసీ కూడా పనిచేయడం లేదు. గోడలకు బిగించిన ఫ్యాన్లు కూడా తిరగడం లేదు. అసలే ఎండాకాలం కావడంతో, ఉక్కపోతతో రోగులు విసుగెత్తి పోతున్నారు. సరిపడా గాలి ఆడక రోగులు అల్లాడుతున్నారు. పలువురు రోగులు విసనకర్రలు, పేపర్లతో విసురుకుంటున్నారు. అసలే అనారోగ్యంతో బాధ పడుతూ వచ్చిన రోగులు గాలి ఆడకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారని రోగుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో పై అంతస్తులకు వెళ్లడానికి ఓపీ వెనక ఉన్న లిఫ్ట్‌ కొన్ని రోజులుగా పని చేయడం లేదు. తరచుగా మొరాయిస్తోంది. దాంతో రోగులను పై అంతస్తులకు తీసుకెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. కలెక్టర్‌ మరింత దృష్టి పెట్టి కఠిన చర్యలు తీసుకుంటే తప్ప జీజీహెచ్‌లో వైద్య సేవలు గాడిలో పడే పరిస్థితి లేదు.

జీజీహెచ్‌లో శనివారం అర్ధరాత్రి వరకు కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు క్యాజువాలిటీ విధుల్లో వైద్యులు కనిపించకపోవడంతో ఆగ్రహం ఎన్‌ఎన్‌ఐసీలోనూ వైద్యులకు బదులుగా నర్సులు విధులు నిర్వహిస్తుండడంతో మండిపడిన కలెక్టర్‌ రేడియాలజీ విభాగంలోకి వెళ్లి రిపోర్టులు ఎప్పుడిస్తున్నారంటూ ప్రశ్నలు వైద్యుల పనితీరుపై ఆరా ఐదుగురు సిబ్బందికి మెమో ఇచ్చిన అధికారులు

No comments yet. Be the first to comment!
Add a comment
అర్ధరాత్రి..ఆకస్మిక తనిఖీ 1
1/1

అర్ధరాత్రి..ఆకస్మిక తనిఖీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement