దమ్ముంటే జెడ్పీ పీఠాన్ని టచ్ చేయి..
ఒంగోలు సిటీ: ‘‘నా జెడ్పీ పీఠాన్ని బాలినేని లాగేస్తాడట.. దమ్ముంటే నా కుర్చీ లాగేయి. నీవు లాగేస్తాననగానే వచ్చేవారు ఎవరూ లేరు. జెడ్పీ చైర్‌పర్సన్ పదవిని నాకు జగన్ ఇచ్చారు. కుర్చీని టచ్ చేసే అర్హత వాసుకు లేదు’’ అని జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై ధ్వజమెత్తారు. ఒంగోలులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఆమె జెడ్పీటీసీ సభ్యులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్‌పర్సన్ మాట్లాడుతూ ‘‘వైవీ సుబ్బారెడ్డి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, మా నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి పెట్టిన రాజకీయ భిక్షతోనే మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులు అనుభవించావు. అసలు నువ్వు ఏరకం నాయకుడివి..పార్టీ వదిలి వెళ్లనని ప్రతి సమావేశంలో చెప్పి..పార్టీ వదిలి వెళ్లిపోతూ వైఎస్ జగన్‌ను విమర్శించడం అన్యాయంగా ఉంది. అంతకు ముందు రాజకీయాల్లో నీ స్థాయి ఏంటో అందరికీ తెలుసు. ఎన్నికల్లో బూచేపల్లి కుటుంబం గెలవకూడదని ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేశావు. బాలినేనీ..నీవు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల్లో బూచేపల్లి కుటుంబం సంపాదించుకున్న మంచి పేరుతోనే అన్నింటినీ ఛేదించుకుని ప్రజాక్షేత్రంలో బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి విజయం సాధించారు. మా కుటుంబంపై నీకు ఎందుకు అంత కక్ష..మేము నీకు ఏం ద్రాహం చేశామని మాపై విషం చిమ్ముతున్నావు. బూచేపల్లి కుటుంబం అంటే నీలాగా ఇన్‌చార్జ్ పదవులు, సీట్లు ఇప్పిస్తానని ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేసే కుటుంబం కాదు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని లంచాలు తీసుకునే కుటుంబం కాదు. నా భర్త సుబ్బారెడ్డి హయాం నుంచి నేటి వరకు ఎవరికై నా ఒక రూపాయి ఇచ్చామే కానీ..లాక్కునే కుటుంబం కాదు. ఎన్నికల ముందు నువ్వు సంపాదించిన డబ్బులు జగన్ లాగేసుకున్నాడని ఆరోపిస్తున్నావు..ముందు నీవు డబ్బులు ఎక్కడ నుంచి సంపాదించావో చెప్పు. అధికారంలో ఉన్నప్పుడు పేచీల మీద పేచీలు పెట్టి జగన్‌ను ఇబ్బందులు పెట్టింది నీవు కాదా.. జగన్ డబ్బులు నువ్వు లాక్కున్నావు తప్ప జగన్ లాక్కోలేదు. ఆ అవసరం మా నాయకుడికి లేదు. 2029లో కచ్చితంగా జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ సీఎం అవుతారు. మాకు పదవులు ఉన్నా, లేకపోయినా జగన్‌మోహన్‌రెడ్డి వెంటే నడుస్తాం. బూచేపల్లి కుటుంబం పైన జగన్‌మోహన్‌రెడ్డి అభిమానంతో జెడ్పీ చైర్‌పర్సన్ పదవి ఇచ్చారు. జెడ్పీటీసీలందరూ మావైపే ఉన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా మమ్మల్ని అన్ని రకాలుగా బాలినేని ఇబ్బందులు పెట్టారు. నీ సీటు ఇంకొకరికి ఇస్తామని చెబుతాడు, అందరి దగ్గర డబ్బులు తీసుకుంటాడు. బూచేపల్లి కుటుంబాన్ని కానీ, జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబాన్ని కానీ విమర్శించే హక్కు బాలినేనికి లేదు’’ అని వెంకాయమ్మ ధ్వజమెత్తారు.
జెడ్పీటీసీలు దుంపా రమణమ్మ, వేమా శ్రీనివాసరావు, మాసం జాన్‌పాల్, తాతపూడి మోజెస్ రత్నరాజు, మడతల కస్తూరిరెడ్డి, నూసం వెంకట నాగిరెడ్డి మాట్లాడుతూ జెడ్పీటీసీలు అందరూ బూచేపల్లి వెంకాయమ్మకు అండగా ఉంటారన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారగానే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఏకవచనంతో మాట్లాడటం బాధాకరమన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ ను మీరు తీసేస్తామని చెప్తే మేము గాజులు తొడుక్కుని లేముగా అని అన్నారు. ఆమె పదవీ కాలం ఐదు సంవత్సరాల్లో ఆఖరి గంట కూడా వదిలిపెట్టమన్నారు. బూచేపల్లి కుటుంబానికి ఉన్న పేరు ప్రఖ్యాతలు, అవినీతి రహిత చరిత్ర ఎవరికై నా ఉందా అని ప్రశ్నించారు. జెడ్పీటీసీలు అంతా మీరు సీట్లు ఇచ్చిన వ్యక్తులు కాదన్న విషయాన్ని బాలినేని గుర్తుంచుకోవాలన్నారు. ఒక దళిత ఎమ్మెల్యే అయిన ఆదిమూలపు సురేష్‌కు మంత్రి పదవి ఇస్తే అలిగి పార్టీకి దూరంగా ఉన్న వ్యక్తి బాలినేని అని విమర్శించారు. బాలినేని దళిత వ్యతిరేకి అన్నారు. అన్నం పెట్టిన పార్టీనీ, అన్నం పెట్టిన రాజశేఖర్‌రెడ్డి కుటుంబాన్ని నిందిస్తున్న నువ్వు కుక్క కంటే హీనమని మండిపడ్డారు. పార్టీ నుంచి బయటకు వచ్చి నిలకడ లేని పవన్‌కళ్యాణ్ తో చేరి మా అధినేతను విమర్శిస్తున్నావన్నారు. ఏమి తెలుసని పవన్‌కళ్యాణ్‌తో నీ ప్రయాణం కొనసాగిస్తావని ప్రశ్నించారు. ఏ ఒక్క మాటైన నిక్కచ్చిగా మాట్లాడిన, నిలబడిన సందర్భాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. పవన్‌కళ్యాణ్ ఎన్ని పార్టీలు మారారు.. ఎంత మందిని మార్చారన్నారు. మోడీ ని తిట్టాడు మోడీతో జతకట్టాడనీ, చంద్రబాబును తిట్టాడు చంద్రబాబుతో జతకట్టాడనీ ఇలా తన రాజకీయ వ్యభిచారం చేస్తున్న పవన్ చెంతకు చేరిన నువ్వు అంత కంటే హీనంగా రాబోయే రోజుల్లో రాజకీయాలకు దూరమవుతావని హెచ్చరించారు. పార్టీని కానీ, జగన్‌మోహన్‌రెడ్డిని కానీ మరోసారి తిట్టినా నిన్ను ముట్టడిస్తామని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. జెడ్పీటీసీలలో ఏ ఒక్కరికి కూడా చైర్మన్ ను దించాలని గానీ, పార్టీ మారే ఆలోచనగానీ లేనే లేదన్నారు. జనసేన పార్టీ బలమెంత.. దానికున్న అభిమానులు ఎంత అని ఎద్దేవా చేశారు. తామంతా వైఎస్సార్ సీపీకి విధేయులమని, డబ్బులకు లొంగేవారం కాదన్నారు. సమావేశంలో కొండపి జెడ్పీటీసీ సభ్యురాలు మారెడ్డి అరుణ, ఒంగోలు జెడ్పీటీసీ సభ్యురాలు చుండూరు కోమలేశ్వరి, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్లా సుబ్బారావు, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర సెక్రటరీ భూమిరెడ్డి రమణమ్మ, ఎస్టీ సెల్ అధ్యక్షురాలు పేరం ప్రసన్న, మహిళా నాయకులు సాధం విజయలక్ష్మి, అప్సర్ బేగమ్, తదితరులు పాల్గొన్నారు.
వైఎస్ జగన్‌ను, బూచేపల్లి కుటుంబాన్ని విమర్శించే అర్హత నీకు లేదు మా కుటుంబం గెలవకూడదని ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేశావు మేమంటే ఎందుకంత కక్ష, ఏం ద్రోహం చేశాం మాజీ మంత్రి బాలినేనిపై భగ్గుమన్న జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ
Comments
Please login to add a commentAdd a comment