వైఎస్సార్ సీపీ నాయకుడి బంకు కూల్చివేత
యర్రగొండపాలెం: వైఎస్సార్ సీపీ నాయకుడి బంకును కూల్చివేయించిన పోలీసులు గ్రామంలో శాంతి, భద్రతల పరిస్థితిని పక్కనపెట్టి తమ ఇష్టాను సారంగా వ్యవహరిస్తున్న సంఘటన యర్రగొండపాలెం మండలంలోని గంగపాలెంలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గంగపాలెంకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గాజుల వెంకటనారాయణ తన ముత్తాతల కాలం నుంచి గ్రామ కంఠం స్థలంలో గడ్డి వామి, దిబ్బ ఏర్పాటు చేసుకున్నారు. కొన్నేళ్ల క్రితం ఆ స్థలానికి సమీపంలో రేకులతో బంకును ఏర్పాటు చేసుకొని చిరు వ్యాపారం చేసుకుంటున్నాడు. ఆ ప్రాంతంలోనే ఉన్న గంగమ్మ గుడిని గ్రామస్తులు అభివృద్ధి చేస్తూ వచ్చారు. వెంకట నారాయణకు వారసత్వంగా వస్తున్న గడ్డివామి దొడ్డి, పేడ దిబ్బ, దుకాణం ఎవరికీ అభ్యంతరం లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం వచ్చాక వెంకట నారాయణను ఇబ్బంది పెట్టేందుకు టీడీపీ నేతలు సమయం కోసం వేచిచూశారు. గత నెల 10వ తేదీన గంగమ్మ తిరునాళ్ల కావడంతో అంతకంటే ముందే కుట్రకు తెరతీశారు. అమ్మవారి తేరు తిరగడానికి అడ్డుగా ఉందంటూ బంకును తొలగించాలని పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు గత నెల 6వ తేదీన పోలీసులు వెళ్లి బంకును పక్కకు నెట్టించారు. ఆ తర్వాత గ్రామానికి చెందిన పెద్దమనుషులు పోలీసుల వద్దకు వెళ్లి జాతర అయిపోయిందని, బంకును తిరిగి ఏర్పాటు చేసుకునేలా అనుమతి ఇవ్వాలని కోరారు. అందుకు పోలీసులు సమ్మతించినట్లు గ్రామస్తులు తెలిపారు. దాదాపు 10 రోజుల క్రితం వెంకట నారాయణ ఆ స్థలంలో బంకును ఏర్పాటు చేసుకున్నాడు. ఇది సహించలేని గ్రామ టీడీపీ నాయకులు వైపాలెం పార్టీ నేతలతో కలిసి పోలీసులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేశారు. దీంతో జేసీబీతో సహా గ్రామానికి వెళ్లిన పోలీసులు బంకుతో సహా వారసత్వంగా వస్తున్న దొడ్డిలోని గడ్డివామి, ఆ పక్కన ఉన్న పేడ దిబ్బను ధ్వంసం చేయించారు. బంకును మరోసారి ఏర్పాటు చేసుకుంటాడన్న ఉద్దేశంతో రేకులను ముక్కలు చేయించారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిని బెదిరించారు.
ఎందుకింత అత్యుత్సాహం?
గ్రామ కంఠం స్థలానికి హక్కుదారు ఎవరో నిర్ణయించాల్సింది రెవెన్యూ అధికారులు. కానీ పోలీసులు సొంత నిర్ణయం తీసుకుని తీసుకుని ఏకపక్షంగా వ్యవహరించడం గ్రామంలో చిచ్చు రాజేసింది. బంకు ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పిన పోలీసులే అత్యుత్సాహం ప్రదర్శించి ధ్వంస రచనకు పూనుకోవడం ఎంత వరకు సమంజమని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.
కూటమి నాయకులకు తలొగ్గిన పోలీసులు దుకాణం పెట్టుకోమని చెప్పి వెనువెంటనే కూల్చివేత గంగపాలెంలో రగులుతున్న వర్గపోరు
Comments
Please login to add a commentAdd a comment