పెద్దదోర్నాలలో చెయిన్ స్నాచింగ్
పెద్దదోర్నాల: మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లిన సంఘటన పెద్దదోర్నాలలో సోమవారం చోటుచేసుకుంది. స్థానిక వెచ్చా వెంకటసుబ్బయ్యనగర్ రెండో లైన్‌లో చీదెళ్ల లాలు, చీదెళ్ల శ్వేత దంపతులు నివాసముంటున్నారు. చీదెళ్ల శ్వేత మధ్యాహ్న సమయంలో ఆరుబయట నిలబడి పొరుగింటివారితో మాట్లాడుతోంది. ఆ సమయంలో ఓ గుర్తుతెలియని యువకుడు శ్వేత మెడలోని బంగారు గొలుసు లాక్కుని పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు మండల కేంద్రంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి యువకుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గొలుసు చోరీ చేసిన యువకుడు లైట్ నీలిరంగు ప్యాంటు, ముదురు నీలిరంగు షర్ట్, నలుపు రంగు టోపి ధరించి మొహానికి గుడ్డ కట్టుకుని ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు.
రేపు మెగా జాబ్‌మేళా
ఒంగోలు వన్‌టౌన్: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీ ఒంగోలులోని శ్రీ హర్షిణి డిగ్రీ కళాశాలలో మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి జె.రవితేజయాదవ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి నుంచి పీజీ వరకూ విద్యనభ్యసించిన నిరుద్యోగ యువతీ యువకులు హాజరై సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎంపికై న వారికి నెలకు రూ.12 వేల నుంచి రూ.35 వేల వరకూ వేతనం ఉంటుందన్నారు. ఇతర వివరాలకు 7989244381 సెల్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
ఆస్తి తీసుకుని కొడుకు గెంటేశాడు
● న్యాయం చేయాలని సబ్ కలెక్టర్‌కు వృద్ధుడి వినతి
మార్కాపురం: వృద్ధాప్యంలో ఉన్న తండ్రికి కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకు.. ఆస్తి రాయించుకుని ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. దీంతో న్యాయం కోసం ఆ వృద్ధుడు సోమవారం మార్కాపురం సబ్‌కలెక్టర్ త్రివినాగ్‌ను ఆశ్రయించారు. వివరాలు.. పుల్లలచెరువు మండలం చాపలమడుగు పంచాయతీలోని కొత్తపల్లికి చెందిన లింగం కోటయ్యకు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఇటీవల ఆయన భార్య మృతి చెందింది. ఏ పనీ చేయలేని స్థితిలో ఉన్న ఆయన వద్ద ఉన్న ఆస్తిని ఒక కొడుకు రాయించుకుని వెళ్లగొట్టాడు. గత్యంతరం లేని స్థితిలో కూతురు వద్ద ఉంటున్నాడు. ఇటీవల కుమారుని వద్దకు వెళ్లగా తన ఇంటికి రావద్దని హెచ్చరించాడని సబ్ కలెక్టర్ ఎదుట వాపోయారు. పొలం అమ్ముకుంటానంటే ‘నువ్వు అమ్మితే ఊర్లో ఎవరు కొంటారో చూస్తా’ అంటూ కుమారుడు బెదిరించాడని, పూట గడవడం లేదని, చావే శరణ్యమని ఆవేదన వెలిబుచ్చారు. తమరే న్యాయం చేయాలంటూ సబ్‌కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
పెద్దదోర్నాలలో చెయిన్ స్నాచింగ్
Comments
Please login to add a commentAdd a comment