నాలుగు పొగాకు బ్యారన్ల దగ్ధం
● రూ.40 లక్షల ఆస్తి నష్టం
జరుగుమల్లి (సింగరాయకొండ): ప్రమాదవశాత్తూ పొగాకు జారి మొద్దు గొట్టంపై పడటంతో పక్కపక్కనే ఉన్న నాలుగు పొగాకు బ్యారన్లు దగ్ధమై సుమారు రూ.40 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ సంఘటన జరుగుమల్లి మండలం రామచంద్రాపురంలో సోమవారం చోటుచేసుకుంది. టంగుటూరు అగ్నిమాపక సిబ్బంది కథనం ప్రకారం.. రామచంద్రాపురం గ్రామానికి చెందిన రావి నాగేశ్వరరావుకు పొగాకు బ్యారన్‌లో పొగాకు కాలుస్తుండగా, ప్రమాదవశాత్తూ ఆకు జారి మొద్దు గొట్టంపై పడి మంటలు చెలరేగి బ్యారన్ తగలబడింది. పక్కనే ఉన్న మరో మూడు బ్యారన్లకు కూడా మంటలు అంటుకుని తగలబడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పడంతో ఒక బ్యారన్ సగం మాత్రమే తగలబడింది. బ్యారన్‌లతో పాటు ఆకు కూడా దగ్ధం కావడంతో బ్యారన్ల యజమానులు ఉన్నం వెంకట్రావు, రావి ఆదిలక్ష్మి, రావి ఆదెమ్మ, నేతి మాలకొండయ్య, నర్రా శ్రీనివాసరావు, నర్రా మురళి, పావులూరి రామారావు, పావులూరి వెంకటేశ్వర్లుకు సుమారు రూ.40 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. అగ్నిమాపక సిబ్బంది మాత్రం రూ.21 లక్షల విలువ గల సామగ్రి కాపాడామని, కేవలం రూ.9 లక్షల సామగ్రికి మాత్రమే నష్టం జరిగిందని చెబుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది బి.సత్యన్నారాయణ, టి.బాలకృష్ణ, డి.వెంకటేశ్వర్లు, ఎస్.శ్రీనివాసులు పాల్గొన్నారు.
కొండపి అగ్నిమాపక సిబ్బంది నిర్లక్ష్యం...
కొండపి అగ్నిమాపక సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా బ్యారన్ల దగ్ధం సంఘటనలో భారీగా ఆస్తినష్టం సంభవించినట్లు పొగాకు రైతులు ఆరోపిస్తున్నారు. సంఘటన జరిగిన రామచంద్రాపురం కొండపి అగ్నిమాపక కేంద్రం పరిధిలోకి వస్తుంది. దీంతో రైతులు ముందుగా కొండపి అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేసి చెప్పారు. కానీ, సిబ్బంది స్పందించకపోవడంతో చివరికి టంగుటూరు సిబ్బందికి సమాచారం అందించారు. టంగుటూరు అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలార్పేలోపు మరో రెండు బ్యారన్‌లు దగ్ధమైనట్లు రైతులు చెబుతున్నారు. కొండపి అగ్నిమాపక సిబ్బంది వెంటనే వచ్చి ఉంటే రెండు బ్యారన్లయినా దక్కి ఉండేవని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment