
వికృతంగా..!
రంగ రంగా..
టీచర్ రంగారెడ్డిని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్న పోలీసులు
కనిగిరి రూరల్: ఐదు పదుల వయసు నిండిన ఆ టీచర్ రోజూ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, లైంగిక వేధింపులకు పాల్పడుతుంటే లోలోన కుమిలిపోయిన బాలికలు ఇక భరించలేక నిజం బయటపెట్టారు. పిల్లల ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కోపోద్రిక్తులై కీచక టీచర్ ఇంటిని ముట్టడించడంతోపాటు కనిగిరి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నమాజ్ చేసి మరీ నిరసన తెలపడం సంచలనం రేపింది. మంగళవారం కనిరిగి పట్టణంలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు విద్యాశాఖ అధికారుల తీరును వేలెత్తి చూపాయి. ఇటీవల కొనకనమిట్ల మండలంలోని ఓ పాఠశాలలోనూ తమ ఉపాధ్యాయుడు లైంగికంగా వేధిస్తున్నాడంటూ బాధిత బాలికలు ఏకంగా బాలల హక్కుల సంరక్షణ కమిషన్ సభ్యురాలికి ఫిర్యాదు చేశారు. దీనిపై అంతర్గత విచారణ సాగుతున్న తరుణంలోనే కనిగిరిలో మరో జుగుప్సాకర ఘటన వెలుగు చూడటంతో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ తీరు, విద్యాశాఖ అధికారుల వ్యవహార శైలిపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
పది రోజుల క్రితమే ఫిర్యాదు
కనిగిరిలోని ఓ పాఠశాలలో సైన్స్ టీచర్ రంగారెడ్డి వికృత చేష్టలతో బాధింపబడిన బాలికలంతా 6, 7 తరగతులకు చెందిన వారు కావడంతో గత కొంత కాలంగా బయటకు చెప్పుకోలేకపోయారు. అయితే పది రోజుల క్రితం సుమారు ఏడుగురు విద్యార్థులు ధైర్యం చేసి టీచర్ అసభ్యకర ప్రవర్తనపై హెచ్‌ఎం కలువ విజయలక్ష్మికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె డీఈఓకు విషయాన్ని లిఖత పూర్వకంగా తెలియజేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో టీచర్‌కు మెమో ఇచ్చి వదిలేయడం గమనార్హం. ఈ క్రమంలో పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న ఓ బాలికకు సోమవారం రుతుస్రావమైంది. తల్లిదండ్రులు ఆ బాలికను ప్రశ్నించడంతో.. టీచర్ వికృత చేష్టల గురించి చెప్పి కన్నీటి పర్యంతమైంది. బాలికకు వైద్యం చేయించిన తల్లిదండ్రులు మంగళవారం తమ బంధువులతో కలిసి కనిగిరిలోనే ఉంటున్న టీచర్ ఇంటిని ముట్టడించారు. బాధిత విద్యార్థినుల తల్లిదండ్రులు, ముస్లిం యువత, స్థానికులు కనిగిరి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. నడి రోడ్డుపై ఇఫ్తార్ దువా, నమాజ్ చేసి నిరసన తెలిపారు. కీచక టీచర్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా బాధిత విద్యార్థినులంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారుగా స్థానికంగా ప్రచారం జరుగుతోంది.
విద్యాశాఖ తీరుపై ప్రజలు, పోలీసుల ఆగ్రహం
టీచర్ బాగోతంపై డీఈఓ కిరణ్‌కుమార్‌కు ఫిర్యాదు అందినా కఠిన చర్యలు తీసుకోకుండా కేవలం మోమోతో సరిపెట్టడం నిర్లక్ష్య వైఖరిని స్పష్టం చేస్తోంది.
విద్యాశాఖ అధికారులు వ్యవహరించిన తీరుపై ఇటు ప్రజలు, అటు పోలీసు వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పాఠశాలలో ఓ టీచర్ నెలల తరబడి బాలికలను లైంగికంగా వేధిస్తున్నా ఇతర ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు దృష్టి సారించకపోవడాన్ని ప్రజలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు.

వికృతంగా..!
Comments
Please login to add a commentAdd a comment