
జంట హత్య కేసులో నిందితుడు అరెస్టు
పెద్దదోర్నాల: మండల పరిధిలోని పెద్దబొమ్మలాపురంలో జరిగిన జంట హత్య కేసులో నిందితున్ని పోలీసులు అరెస్టు చేసి మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. మండల పరిధిలోని పెద్దబొమ్మలాపురంలో దాయాదుల నడుమ సెంటున్నర స్థలం కోసం వివాదం కొనసాగిందన్నారు. ఈ నేపథ్యంలో పంచాయితీనీ తీర్చేందుకు గుంటూరులో ఉన్న దూదేకుల నూర్జహాన్‌బీతో పాటు ఆమె తోబుట్టువులు బొమ్మలాపురం వచ్చారు. ఈ నెల 6 తేదీన ఇరువర్గాల నడుమ చిన్నపాటి ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో 7వ తేదీ తెల్లవారుజామున ఆరుబయట నిద్రిస్తున్న దూదేకుల నాగూర్‌వళి అతడి పెద్దమ్మ దూదేకుల నూర్జహాన్‌బీలను మరో వర్గానికి చెందిన దూదేకుల ఖాశింవలి మరికొందరు బందువులతో కలిసి వారిపై పెట్రోలు పోసి నిప్పటించారు. దీంతో తీవ్ర గాయాల పాలైన ఇద్దరిని ఒంగోలుకు తరలించారు. వారు చికిత్స పొందుతూ మృతి చెందారు. దూదేకుల నూర్జహాన్‌బి భర్త మస్తాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో 17వ తేదీ సోమవారం నిందితుడిని చిన్నదోర్నాల అడ్డరోడ్డు వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. కేసుకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ చేసి కేసులో సంబంధం ఉన్న మిగిలిన నిందితులను అదుపులోనికి తీసుకుంటామని తెలిపారు. నిందితుడిని మార్కాపురం కోర్టులో హాజరు పర్చనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మీడియా ఎదుట ప్రవేశపెట్టిన డీయస్పీ నాగరాజు
Comments
Please login to add a commentAdd a comment