
రక్షణ కల్పించాలని బాధితురాలి ఆవేదన
ఒంగోలు టౌన్: నాకు, నా బిడ్డకు ప్రాణాలకు రక్షణ కల్పించాలని.. తనను లైంగికంగా, మానసికంగా వేధించిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని నగరంలోని రాజీవ్ గృహకల్ప అర్బన్ హెల్త్ సెంటర్ లో ఎల్జీఎస్ కే సరోజ కోరారు. మంగళవారం ఫొటోగ్రాఫర్ అసోసియేషన్ హాలులో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడింది. అర్బన్ హెల్త్ సెంటర్‌లో లాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న కోకిలగడ్డ సురేంద్ర బాబు, డేటా ఎంట్రీ ఆపరేటర్ షేక్ మహమ్మద్ అన్సారీలు తనను లైంగికంగా వేధించడమే కాకుండా మానసికంగా ఇబ్బందులు పెట్టారని తెలిపింది. ఈ విషయాన్ని డీఎంహెచ్‌ఓ కార్యాలయంతో పాటు జిల్లా పోలీసు అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లినప్పటికీ ప్రయాజనం లేకుండా పోవడంతో విధిలేని పరిస్థితిలో న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలిపారు. తాలుకా పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టడానికి వెళ్తే సీఐ అజయ్ కుమార్ దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. న్యాయస్థానానికి వెళ్లిన తనకు ఎట్టకేలకు న్యాయం జరిగిందని, నిందితులను అరెస్టు చేయాలని తాలుకా పోలీసులను ఆదేశించారని తెలిపారు. దాంతో తాలుకా పోలీసులు కేసు ఎఫ్‌ఐఆర్ చేశారని, అప్పటి నుంచి నిందితులు నా కుటుంబ సభ్యులతో పాటుగా నన్ను చంపుతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తాలుకా పోలీసులు నిందితులకు వత్తాసు పలుకుతూ ఇప్పటి వరకు అరెస్టు చేయకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపించింది. వెంటనే నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment