
కూటమి తంట!
మాటల మంట..
‘‘రాజకీయంగా జనసేన పార్టీ నిలదొక్కుకోవడమే కాకుండా,
40 ఏళ్ల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా నిలబెట్టాం’’
అంటూ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ పిఠాపురంలో చేసిన వ్యాఖ్యలు జిల్లా కూటమిలో చిచ్చు రేపింది.
పవన్ లేకపోతే టీడీపీ ఉండేది కాదు అని మాట్లాడటం సమంజసం కాదు అంటూ తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ మా వల్లే గెలిచాడంటూ కౌంటర్
ఇస్తున్నారు. దీనిపై జనసేన కార్యకర్తలు సైతం సోషల్ మీడియా వేదికగా టీడీపీపై విరుచుకుపడుతున్నారు.
ఇదే అంశంపై జిల్లాలో అక్కడక్కడా చిన్నపాటి ఘర్షణలు సైతం చోటుచేసుకోడం గమనార్హం.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య పరిస్థితి ఉప్పు నిప్పులా తయారైంది. ఇరుపార్టీల కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటూ దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఒకరిపై మరొకరు కామెంట్లు చేసుకుంటూ మంటలు రాజేస్తున్నారు. కులం ప్రస్తావనలు సైతం తీసుకొస్తున్నారు. దీంతో కూటమి నేతలు, కార్యకర్తల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని చెప్పవచ్చు. అసలే జిల్లాలో టీడీపీ, జనసేనల మధ్య అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు ఇప్పుడు మరింత దిగజారినట్లు తెలుస్తోంది.
కారుకూతలు కూస్తే
కంఠం తెగుద్ది...
టీడీపీ, జనసేన మధ్య సోషల్ మీడియాలో జరుగుతున్న వార్ నేపథ్యంలో చెరుకూరి ఫణికుమార్ అనే జనసేన కార్యకర్త విడుదల చేసిన ఆడియో సంచలనం రేకెత్తించింది. టీడీపీ నాయకుల పిచ్చి పిచ్చి కామెంట్లు వినదలచుకోలేదని చెప్పిన ఆయన కారుకూతలు కూస్తే కంఠం తెగుద్దని హెచ్చరించడంతో వివాదం మరింత ముదిరినట్లు కనిపిస్తోంది. మద్యం దుకాణాలు ఇవ్వకపోయినా, రేషన్ దుకాణాలు ఇవ్వకపోయినా, రోడ్డు కాంట్రాక్టులు ఇవ్వకపోయినా అడగడం లేదని, జనసేన మీద కామెంట్స్ చేస్తే మాత్రం సహించేది లేదని కుండబద్దలు కొట్టాడు. టీడీపీలోని అధికార పార్టీకి చెందిన సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా జనసేన కార్యకర్తలను తూలనాడుతున్నారని, కులహంకారంతో ప్రవర్తిస్తే బాగుండదని హితవు పలికాడు. ప్రపంచ మేధావి అని చెప్పుకునేవాళ్లు చొక్కాలు నలిగి రాజమండ్రి జైల్లో ఎలా ఉన్నారో అంటూ అవినీతి కేసులో అరెస్టయిన చంద్రబాబు గురించి ప్రస్తావించిన ఆయన మళ్లీ అలా ఉండడానికి ఇష్టమైతే మాతో గొడవ పెట్టుకోండని సలహా ఇచ్చాడు. ఒళ్లు దగ్గర పెట్టుకొని ప్రవర్తించకపోతే, కులహంకారంతో రెచ్చిపోతే టీడీపీ గతి ఎలా ఉంటుందో ఊహించుకోవాలని అనడం వివాదానికి మరింత అగ్గిరాజేసినట్టయింది. 2019లో పొత్తు పెట్టుకోకపోవడంతో ఇబ్బందులు పడ్డామని, అలాంటి పరిస్థితి పునరావృతమైతే ఇంటి నుంచి బయటకు కూడా రాలేరని చెప్పడం చర్చనీయాంశమైంది. ఈ ఆడియో జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది.
సింగరాయకొండలో
టీడీపీ భూ కబ్జాపై ఫిర్యాదు..
కొండపి నియోజకవర్గంలోని సింగరాయకొండలో తెలుగుదేశం నాయకులు భూ కబ్జాకు చేసిన ప్రయత్నాలపై జనసేన మండల పార్టీ అధ్యక్షుడు ఐనాబత్తిన రాజేష్ ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. గ్రామంలోని బాలుర వసతి గృహం వెనక సోమరాజుపల్లి లో సర్వే నెంబర్ 686లో మిగిలి ఉన్న 1.50 సెంట్ల స్థలాన్ని టీడీపీ నాయకులు కబ్జా చేసి అక్రమంగా విక్రయాలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ స్థలంలో గృహనిర్మాణాలు చేస్తున్నట్టు సమాచారం. టీడీపీలోని పెద్ద తలకాయల అండదండలతో అధికారుల నోళ్లు మూయించిన పచ్చ ముఠాపై జనసేన ఫిర్యాదు చేయడం కూటమి పార్టీల మధ్య విభేదాలకు ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్పవచ్చు.
ఒంగోలులో మూడు ముక్కలాట...
జిల్లా కేంద్రమైన ఒంగోలులో జనసేన పార్టీలో మూడు ముక్కలాట కొనసాగుతోంది. రియాజ్ జనసేన, అరుణ జనసేన, బాలినేని జనసేనలుగా విడిపోయింది. రియాజ్ వర్గం మొదట్నుంచి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌తో ఉంటుండగా, అరుణ ప్రస్తుతం బాలినేని వర్గంతో సానుకూలంగా వ్యవహరిస్తోంది. బాలినేని పేరు వింటేనే చాలు తెలుగుదేశం పార్టీ నాయకులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. నువ్వు ఏ పార్టీలో చేరినా నిన్ను దేవుడు కూడా రక్షించలేరని ఎమ్మెల్యే దామచర్ల బహిరంగంగానే హెచ్చరించిన నేపథ్యంలోనే బాలినేనిని ఒంగోలులో అడుగుపెట్టకుండా కట్టడి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. గిద్దలూరు నుంచి పోటీ చేయడానికి ప్రయత్నించి విఫలమై టీడీపీ మీద తీవ్రమైన విమర్శలు చేసిన ఆమంచి స్వాములు ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు. అధికార టీడీపీ నాయకుల తీరుపై మండిపడిన బెల్లంకొండ సాయిబాబా పత్తా లేకుండా పోయాడు. ఒంగోలు నగరంలో టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న జడా నాగేంద్ర కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అంటే టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న నాయకులను ఏదో రకంగా అణిచివేస్తున్నట్లు జనసేన కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో తమకు కార్పొరేషన్ పదవులు వస్తాయని చాలా మంది జనసేన నాయకులు ఆశలు పెట్టుకున్నారు. జిల్లా అధ్యక్షుడు రియాజ్, రాష్ట్ర అధికార ప్రతినిధిగా చెప్పుకునే రాయపాటి అరుణ ఊహల్లో విహరించారు. ఆ ఇద్దరికి చివరికి మొండిచేయి చూపించడంతో మింగలేక కక్కలేక తెగ ఇబ్బంది పడిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ నాయకులు నమ్మించి మోసం చేసినట్లు ఈ ఇద్దరు నాయకులు సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు సమాచారం.
జిల్లాలో టీడీపీ, జనసేన మధ్య పెరిగిన దూరం..
ఎన్నికల ముందు కలిసి పనిచేసిన టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన జిల్లా నాయకులు, కార్యకర్తల మధ్య అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు ఇటీవల కాలంలో మరింత దిగజారినట్టు తెలుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జనసేన నాయకులు కూడా అక్రమ వ్యాపారాల్లో వాటాలను ఆశించారు. అయితే టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరూ వీరిని దగ్గరకు రానీయడం లేదు. జనసేన నాయకులను కలుపుకునే ప్రయత్నాలు చేయడం లేదు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన తొలి సమావేశంలో జనసేన నాయకులు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లినా అప్పటికీ పెద్దగా పట్టించుకోలేదు. జిల్లా కేంద్రమైన ఒంగోలు నుంచి మొదలుకొని యర్రగొండపాలెం వరకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులే మద్యం దుకాణాలు, రేషన్ అక్రమ సరఫరా, మైనింగ్ రవాణా చేసుకుంటున్నారని జిల్లా జనసేన నాయకులు వాపోతున్నారు. మా నోట్లో మట్టి కొడుతున్నారని లబోదిబోమంటున్నారు.
పవన్ వ్యాఖ్యలతో జిల్లా టీడీపీ, జనసేనల్లో అలజడి 40 ఏళ్ల టీడీపీని నిలబెట్టింది నేనే అంటూ చేసిన ప్రకటనపై అభ్యంతరాలు టీడీపీ, జనసేన కార్యకర్తల నడుమ సోషల్ మీడియా వార్ జనసేనతో పొత్తు 95 శాతం టీడీపీ కార్యకర్తలకు ఇష్టం లేదని తెలుగు తమ్ముళ్ల ఎదురుదాడి రాజమండ్రి సెంట్రల్ జైలులో ప్రపంచ మేధావి చొక్కా తడిసిందంటూ జనసేన పోస్టులు కులహంకారంతో మాట్లాడుతున్నారంటూ టీడీపీ వారిపై ఆగ్రహం కారుకూతలు కూస్తే కంఠం తెగుద్దంటూ తమ్ముళ్లకు హెచ్చరిక
Comments
Please login to add a commentAdd a comment