బాలల భద్రత, సంరక్షణకు విఘాతం కలిగించొద్దు
● రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి
ఒంగోలు సిటీ: కొంతమంది ఉపాధ్యాయులు బాలల భద్రత, బాలల సంరక్షణకు విఘాతం కలిగించటం, లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడడం విచారకరమని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి మంగళవారం అన్నారు. కనిగిరిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై తీవ్రంగా స్పందించిన ఆమె మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకునేందుకు ప్రతి పాఠశాలలో సంరక్షణ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యాశాఖతో పాటు పోలీసు, ఐసీడీఎస్, డీసీపీయూ కలిసి దర్యాప్తు చేపట్టి ఇంకా ఎంతమంది బాలికల పట్ల అనుచితంగా ప్రవర్తించాడు, లైంగిక వేధింపులకు గురి చేశాడనే విషయాన్ని పరిశీలించి సమగ్ర నివేదిక ను రెండు రోజుల్లోనే రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు సమర్పించాలని అన్ని శాఖలను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి స్కూల్లో ప్రొటెక్షన్ కమిటీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లలకు తగిన కౌన్సిలింగ్, తల్లిదండ్రులతో ఉపాధ్యాయులకు ఒక మీటింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. జిల్లాలో గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో బాలల సంరక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని విద్యాశాఖను ఆదేశిస్తూ, పోలీస్, ఐసీడీఎస్ సమన్వయంతో డీసీపీయూ ద్వారా పిల్లలకు తగిన రక్షణ కల్పించాల్సిందిగా ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment