కేసుల్లో సమగ్ర విచారణ చేయాలి
● ఎస్పీ దామోదర్
ఒంగోలు సిటీ: కేసుల్లో సమగ్ర విచారణ చేసి త్వరితగతిన నిందితులను అరెస్ట్ చేయాలని ఎస్పీ దామోదర్ అన్నారు. జిల్లాలో నమోదైన నకిలీ డాక్యుమెంట్స్, స్టాంపులు, భూ అక్రమ, ఫోర్జరీకి సంబంధించిన 109 కేసులపై ప్రత్యేక దర్యాప్తు టీం అధికారులతో బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ ఆయా కేసుల దర్యాప్తు తీరుతెన్నులు, పురోగతి, నిందితుల అరెస్టు, చార్జిషీటు దాఖలు తదితర అంశాలపై పోలీస్ అధికారులను ఆరా తీసి, కేసుల సంబంధిత డాక్యుమెంట్స్, సీడీ ఫైల్స్ పలిశీలించారు. కేసుల సత్వర పరిష్కారానికి సూచనలిచ్చారు. ఒకే ప్రాంతానికి చెందిన పలు కేసులను ఇతర పోలీస్ అధికారులకు కేటాయించారు. ఈ కేసుల్లో నకిలీ పత్రాలు, స్టాంపులు, ఫోర్జరీ సంతకాలతో జరిగిన భూ అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించాలని సిట్ అధికారులకు సూచించారు. నకిలీ డాక్యుమెంట్స్ గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని, ప్రాథమిక ఆధారాలతో పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలు, రిజిస్ట్రార్ వారి సహకారం, సమన్వయంతో దర్యాప్తు చేయాలని, ఇళ్ల స్థలాలు, ప్లాట్లు, భూములపై రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇతర పత్రాలను సంబంధిత శాఖల ద్వారా వెరిఫై చేసి వాటికి సంబంధించిన వాస్తవ యజమానులు, డాక్యుమెంట్లను గుర్తించాలన్నారు. ఈ కేసుల్లో దర్యాప్తు మరింత వేగవంతం చేసి నిందితులను సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేయాలని, పూర్తయిన కేసుల్లో చార్జిషీట్లు ఫైల్ చేసి కోర్టులో విచారణ ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, ఒంగోలు డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, దర్శి డీఎస్పీ లక్ష్మీ నారాయణ, మార్కాపురం డీఎస్పీ నాగరాజు, కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, డీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్ దేవప్రభాకర్, సిట్ టీం సీఐలు పాల్గొన్నారు.
కేసుల్లో సమగ్ర విచారణ చేయాలి
Comments
Please login to add a commentAdd a comment