పాకల బీచ్‌లో యువకుడు గల్లంతు?
● మద్యం మత్తులో ఉన్న ఇద్దరు స్నేహితులు
సింగరాయకొండ: పాకల బీచ్‌లో బుధవారం ఓ యువకుడు తప్పిపోయిన సంఘటన మిస్టరీగా మారింది. పోలీసుల కథనం ప్రకారం.. టంగుటూరు మండలం ఎం.నిడమానూరు గ్రామానికి చెందిన సిసింద్రీ(27), అతని బంధువులు హర్ష, దినేష్ పాకల బీచ్‌కు వచ్చారు. వీరు ముగ్గురూ బీచ్‌లో పూటుగా మద్యం తాగారు. బీచ్ ఒడ్డున సిసింద్రీ వేసుకున్న దుస్తులు ఉన్నాయి తప్ప అతని చెప్పులు కనపడలేదు. మద్యం మత్తులో ఉన్న హర్ష, దినేష్ ఒక్కోసారి ఒక్కోమాట చెబుతున్నారు. ముగ్గురమే వచ్చామని ఒకసారి, ఆరుగురం కలిసి వచ్చామని మరో చెబుతుండటంతో తలపట్టుకోవడం పోలీసుల వంతైంది. వీరికి మద్యం మత్తు దిగితే తప్ప వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం లేదని పోలీసులు చెబుతున్నారు. సిసింద్రీ సముద్ర స్నానం చేస్తూ కొట్టుకుపోయాడా లేక మరెవరితోనైనా వెళ్లాడా అనేది విచారణలో తేలాల్సి ఉంది. కాగా సిసింద్రీ తప్పిపోయినట్లుగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై బి.మహేంద్ర తెలిపారు. సిసింద్రీ బేల్దారి పని చేస్తుంటాడని, అతని బంధువులు ఇద్దరు తమ పర్యవేక్షణలో ఉన్నారని ఎస్సై చెప్పారు.
తాళ్లూరులో పొగాకు బ్యారన్ దగ్ధం
● రూ.8 లక్షలు ఆస్తి నష్టం
తాళ్లూరు: ప్రమాదవశాత్తు పొగాకు బ్యారన్ దగ్ధమైన సంఘటన తాళ్లూరు గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన ఇడమకంటి నాగిరెడ్డికి చెందిన బ్యారన్‌లో పొగాకు క్యూరింగ్ చేస్తుండగా బుధవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. దాదాపు 1200 పొగాకు కర్రలు కాలిపోవడంతో రూ.8 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని రైతు నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతు నాయకులు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment