ఏఎస్సై బాషాకు రాష్ట్ర పోలీసు, అగ్నిమాపక సేవా పతకం
సింగరాయకొండ: రాష్ట్ర పోలీసు, అగ్నిమాపక సేవాపతకం ఉగాది–2025 కు ఏఎస్సై షేక్ మహబూబ్‌బాషా ఎంపికయ్యారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఆయనకు ఈ అవార్డు లభించింది. మహబూబ్ బాషా మాట్లాడుతూ తాను గతంలో కేంద్ర ప్రభుత్వ ఉత్తిష్ట సేవాపతకం, 70 నగదు అవార్డులు, 25 గుడ్ సర్వీస్ ఎంట్రీ, 5 ప్రశంస పత్రాలు అందుకున్నానని వివరించారు. తనకు అవార్డు రావడానికి సహకరించిన ఎస్పీ ఏఆర్ దామోదర్, డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, సీఐ సీహెచ్ హజరత్తయ్య, ఎస్సై బీ మహేంద్రలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఘనంగా ప్రపంచ కవితా దినోత్సవం
ఒంగోలు మెట్రో: నరసం, కళా మిత్రమండలి, తెలుగు లోగిలి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఒంగోలు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ప్రపంచ కవితా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సభకు నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం గౌరవ అధ్యక్షురాలు తేళ్ల అరుణ అధ్యక్షత వహించి మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్క కవి బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, కవిత్వాన్ని ఆయుధంగా చేసుకొని రచనలు చేయాలన్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా గ్రంథాలయం సంస్థ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి మాట్లాడుతూ సామాజిక రుగ్మతలతో బాధపడుతున్న వారిని సరైన దిశకు మళ్లించి దిశా నిర్దేశం చేసేలా కవిత్వం ఉండాలన్నారు. నాగభైరవ సాహిత్య పీఠం అధ్యక్షుడు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ మాట్లాడుతూ కవిత్వం, సాహిత్యం ఎప్పుడూ సమాజ శ్రేయస్సునే కోరుకుంటుందని, అందుకే తామంతా సాహిత్య మార్గాన్ని ఎంచుకున్నామని తెలిపారు. కళా మిత్రమండలి సంస్థ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ నూనె అంకమరావు సంచాలకత్వంలో కవి సమ్మేళనం నిర్వహించారు. పోతుల పెద వీరనారాయణ, కుర్రా ప్రసాద్ బాబు, ఓరుగంటి ప్రసాద్, డాక్టర్ సంతవేలూరి కోటేశ్వరరావు, మిడసల మల్లికార్జునరావు, బీరం అరుణ, బండారు సునీత, జి పద్మజ, యన్.నరసమ్మ, యు.వి.రత్నం, పిన్ని వెంకటేశ్వర్లు, నిమ్మల వెంకయ్య, గుండుపల్లి రాజేంద్రప్రసాద్, కేఎస్వీ ప్రసాద్, చుండూరి శ్రీనివాసరావు, హనుమంతరావు, అంగలకుర్తి ప్రసాద్, పాల్గొన్నారు.
పౌష్టికాహారంతో మాతృమరణాల నివారణ
ఒంగోలు సిటీ: అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు పౌష్టికాహారం తీసుకుంటే మాతృమరణాలు నివారించవచ్చని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వారి చాంబర్‌లో ఇటీవల సంభవించిన మాతృ మరణాలపై శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఏఎన్‌ఎంలు, సీహెచ్‌వోలు ప్రమాద సంకేతాలున్న గర్భిణులు, అనీమియా, అధిక రక్తపోటు, మధుమేహం, ఎపిలెప్సీ, ప్రసవ పూర్వ రక్తస్రావంతో బాధపడుతున్న వారిని సకాలంలో గుర్తించి వారికి సరైన సమయంలో వైద్య సేవలు అందించటం ద్వారా మాతృమరణాలు నివారించవచ్చన్నారు. జిల్లా పరిధిలో మాతృ మరణాలు సంభవిస్తే అందుకు కారకులైన సిబ్బంది పై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయ కర్త డాక్టర్ సూరిబాబు, ఐ.ఎం.ఎ, ఫోగ్సి ప్రతినిధులు డాక్టర్ జాలాది మణిబాబు, డాక్టర్ కమల, డాక్టర్ పి.పద్మజ, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారిని, డాక్టర్ అనంత కుమారి, డాక్టర్ చలపతి, డాక్టర్ శిరీష ప్రియదర్శిని, సుగుణమ్మ డీపీహెచ్‌ఎన్‌ఓ. డి.శ్రీనివాసులు, మాస్ మీడియాధికారి, అర్ధవీడు ప్రాథమిక ఆరోగ్య వైద్య అధికారి డాక్టర్ జవహర్ కుమార్ పాల్గొన్నారు.
ఏఎస్సై బాషాకు రాష్ట్ర పోలీసు, అగ్నిమాపక సేవా పతకం
Comments
Please login to add a commentAdd a comment